logo

బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు

గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు.

Published : 27 Apr 2024 03:58 IST

నామపత్రాల ఉపసంహరణలోగా అవకాశం
గుర్తుల కేటాయింపుపై శ్రద్ధ

అచ్చంపేట, న్యూస్‌టుడే : గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. లోక్‌సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ నిబంధన అమలు చేస్తారు. పార్టీ తరఫున ఎన్నికలు నిర్వహించినప్పుడు ఆయా పార్టీల గుర్తులను కేటాయించేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసే అభ్యర్థులు బీ ఫారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం వారికి ప్రత్యేక గుర్తులను కేటాయిస్తుంది. అభ్యర్థులు తమ నామపత్రం దాఖలు చేసే సమయంలో ఏదైనా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా? లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా అనే విషయాన్ని అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారికి ఆ పార్టీ అధికార ప్రతినిధి బీ ఫారంపై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు రాసి దానిపై ముద్ర వేసి ఇస్తారు. బీ ఫారాన్ని పొందిన వ్యక్తి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామపత్రాల ఉప సంహరణలోగా అందజేయాల్సి ఉంటుంది.

ఏ ఫారం పొందిన వారికే అధికారం.. : రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా పార్టీలు బీ ఫారం అందజేసేందుకు ఒకరికి అధికారం కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి అభ్యర్థులకు బీ ఫారం అందజేస్తారు. ప్రతి పార్టీలో ఒకరికి బీ ఫారం అందజేసే అధికారాన్ని అప్పగిస్తారు. బీ ఫారం జారీ చేసే వ్యక్తికి మొదట పార్టీ అధ్యక్షుడు ఏ ఫారం అందజేస్తారు. పార్టీ తరఫున ఏ ఫారం పొందిన వ్యక్తి మాత్రమే పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారం అందజేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక పార్టీ తరఫున ఒక అభ్యర్థికి మాత్రమే బీ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఫారం పొందిన వ్యక్తి తనకు ఫలానా పార్టీ అభ్యర్థులకు బీ ఫారం అందజేసే అధికారం ఇచ్చారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తెలియజేసి తనకు పార్టీ జారీ చేసిన ఏ ఫారాన్ని జత చేయాలని పార్టీ అభ్యర్థులు పార్టీ గుర్తు పొందడానికి బీ ఫారాన్ని అధికారికి అందజేయాలి. ఇదే విషయాన్ని ఆర్వో ధ్రువీకరించుకుంటారు. ఒక నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీ తరపున ఒక బీ ఫారాన్ని మాత్రమే ఆర్వో గుర్తించి ఆ వ్యక్తికి మాత్రమే పార్టీ గుర్తును కేటాయిస్తారు. బీ ఫారాన్ని గడువులోగా అందజేయకపోతే అతడిని స్వతంత్ర అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు