logo

కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్‌నగర్‌లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు.

Published : 27 Apr 2024 03:59 IST

మాట్లాడుతున్న రాణి రుద్రమ, చిత్రంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీరెడ్డి తదితరులు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్‌నగర్‌లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఆమె పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భాజపా అభ్యర్థి డీకే అరుణపై ఇష్టానుసారంగా ఆరోపణలు, విమర్శలు చేయడం కాంగ్రెస్‌ పార్టీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్ని ఎత్తుగడలు వేసినా, భాజపా అభ్యర్థిపై ఏ స్థాయిలో ఆరోపణలు చేసినా ప్రజలు తిప్పికొడతారని పేర్కొన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భాజపా అభ్యర్థి డీకే అరుణను గుండెల్లో పెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. సెక్యులర్‌ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్‌ నేతలు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆహ్వానం పంపితే ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. ఈ దేశంలో నిజమైన సెక్యులర్‌ పార్టీ భాజపాయేనని, రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ భాజపాను మతతత్వ పార్టీగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయని, భాజపా పదేళ్ల పాలనలో ఒక్క కుంభకోణం కూడా లేదని, ప్రధాని మోదీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీ పేరుతో మభ్యపెట్టి భారాసపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ హామీల అమలులో విఫలమైందన్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది భాజపా ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌కు ఓటేస్తే వృథా అవుతుందని పేర్కొన్నారు. భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి పాలమూరును అభివృద్ధి చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీరెడ్డి, నేతలు కె.రాములు, నిరంజనమ్మ, పద్మవేణి, జయశ్రీ, రమేశ్‌కుమార్‌, బుచ్చిరెడ్డి, తిరుపతిరెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని