logo

పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్‌

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్‌నగర్‌లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 27 Apr 2024 07:05 IST

భాజపాపైనే విమర్శలు ఎక్కుపెట్టిన కేసీఆర్‌
నేడు నాగర్‌కర్నూల్‌లో కొనసాగనున్న పర్యటన

క్లాక్‌టవర్‌లో నిర్వహించిన కూడలి సమావేశంలో ప్రసంగిస్తున్న కేసీఆర్‌, చిత్రంలో నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి   

ఈనాడు, మహబూబ్‌నగర్‌- మహబూబ్‌ నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్‌నగర్‌లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ చౌరస్తా నుంచి క్లాక్‌టవర్‌ వరకు రోడ్‌షో నిర్వహించగా జనం భారీగా హాజరయ్యారు.  కేసీఆర్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. క్లాక్‌టవర్‌ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు కేసీఆర్‌ పట్ల తమ అభిమానాన్ని చూపడం చూసిన స్థానిక నేతల్లో నూతనోత్సాహం కనిపించింది.

బస్సుయాత్ర సాయంత్రం 5.30కు మహబూబ్‌నగర్‌లోకి ప్రవేశించింది. బాలానగర్‌లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద ఉన్న ఓ హోటల్‌లో కొద్దిసేపు విశ్రాంతికి ఆగారు. అక్కడే అల్పాహారం, తేనీరు సేవించి బయలుదేరారు. జడ్చర్ల ఫ్లై ఓవర్‌ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు గుమ్మడికాయతో కేసీఆర్‌ బస్సుయాత్రకు దిష్టి తీశారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లి ఫ్లై ఓవర్‌ వద్దకు రాగానే పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి ఘనస్వాగతం పలికారు. పూలు చల్లారు. అక్కడి నుంచి మెట్టుగడ్డ వరకు శ్రేణులతో కలిసి బస్సుయాత్ర కొనసాగింది.  క్లాక్‌టవర్‌ వద్దకు కేసీఆర్‌ రాగానే పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. భవనాలపైకి ఎక్కి పూల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్‌.. సీఎం కేసీఆర్‌ అంటూ నినాదాలు చేశారు.

గడియారం చౌరస్తాలో జనసందోహం

భాజపాను లక్ష్యంగా చేసుకోని..: కేసీఆర్‌ తన ప్రసంగంలో భాజపాను లక్ష్యంగా చేసుకునే ఎక్కువగా విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్‌లో భారాసకు పోటీ భాజపానే అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మహబూబ్‌నగర్‌ అభ్యర్థి డీకే అరుణపై కూడా విమర్శలు గుప్పించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని ఆమెను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయనపై పెద్ద ఎత్తున వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తారని భావించారు. కేవలం గ్యారంటీ కార్డుల అమలులో రేవంత్‌ ప్రభుత్వం విఫలమైందని ప్రస్తావించారు. వ్యక్తిగత విమర్శల జోలికి పోలేదు. కాంగ్రెస్‌కు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లేనన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు ప్రయత్నం చేశారు. కొద్ది సేపు ఉర్దూలో మాట్లాడి ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు డా.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌ పాల్గొన్నారు. రోడ్‌ షోలో భాగంగా శ్రీనివాస్‌ గౌడ్‌ బస్సు కిందికి దిగి నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఆయనను పార్టీ శ్రేణులు మోసుకుంటూ, నినాదాలు చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లారు. క్లాక్‌టవర్‌ వద్ద సభ ముగిసిన తర్వాత అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూసి బస్సుపైనే శ్రీనివాస్‌గౌడ్‌ డాన్స్‌ చేశారు.

ఫాంహౌజ్‌లో బస..: కూడలి సమావేశం అనంతరం కేసీఆర్‌ పాలకొండలోని శ్రీనివాస్‌గౌడ్‌ ఫాంహౌజ్‌కు తరలివెళ్లారు. శుక్రవారం రాత్రి అక్కడే ఆయనకు బస ఏర్పాటు చేశారు. శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొనే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ముఖ్యులతో భారాస అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు నాగర్‌కర్నూల్‌లోని ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్‌ వరకు రోడ్‌ షో కొనసాగనుంది. అక్కడే కార్నర్‌ సమావేశంలో కేసీఆర్‌ పాల్గొననున్నారు. దీంతో జిల్లాలో రెండు రోజుల కేసీఆర్‌ బస్సుయాత్ర పర్యటన ముగుస్తుంది.

కేసీఆర్‌ హయాంలో అన్ని రంగాల  అభివృద్ధి : మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం, దోపిడీ, వలసలను చూసి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తారని, చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారని పేర్కొన్నారు. సీఎంగా పదేళ్ల పాటు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతల మాయమాటలతో ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. రైతుబంధు ఆగిపోయిందని, రుణమాఫీ చేయలేదని తెలిపారు. రూ.4వేల పింఛను ఏమైందని, రూ.500లకు వంటగ్యాస్‌ రావటం లేదని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంలో రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని