logo

గుంభనంగా ద్వితీయ శ్రేణి

అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది.

Updated : 27 Apr 2024 07:08 IST

గెలుపోటములపై ప్రభావం

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. మూడు ప్రధాన పార్టీల్లో అదే పరిస్థితి నెలకొంది. మూడు పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకుల్లో గుసగుసలు మొదలయ్యాయి. బయటికి ఒకలా, లోపల మరోలా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు రోడ్డు షోలు, ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో స్తబ్ధత నెలకొనడంతో ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం లేదనే అభిప్రాయం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న సమావేశం నిర్వహించినా.. కార్యకర్తల సమీకరణ పోటీ పడి చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒకరి పేరు చెప్పి మరొకరికి ఓట్లు వేద్దామనే సరళి కొనసాగుతోంది.

మాజీలు సత్తా చాటేనా? : మాజీ ఎంపీ మంద జగన్నాథం కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీఎస్పీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్టు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శలు చేశారు. బీఎస్పీ నుంచి పోటీ చేస్తే ఎవరికిపై ప్రభావం పడుతుందనే చర్చ సాగుతోంది. మరోవైపు అధికార పార్టీలో చేరికలను కొనసాగిస్తున్నారు. ఎంపీ రాములు తన కుమారుడు భరత్‌ ప్రసాద్‌కు మద్దతు ఇవ్వాలని మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులను చరవాణిలో అభ్యర్థిస్తున్నారు. మాజీ ఎంపీ మల్లురవి, భారాస అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాజీ సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధుల వద్దకు నేరుగా వెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని మూడు పార్టీల అభ్యర్థులు అన్ని పార్టీల నాయకులను ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి ఈ ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

ఆర్థికంగా భారం.. సంశయం : ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల్లో ఉండే ఇన్‌ఛార్జులు ఇంకా చురుగ్గా వ్యవహరించటం లేదు. ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలంటే ఎక్కడ ఆర్థిక భారం తమ మీద పడుతుందనే ఉద్దేశంతో దూరం దూరంగా ఉంటున్నారు. కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం లేదు. ద్వితీయ శ్రేణి నాయకులను ఏకతాటిపైకి తేవడంలో పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఓటేసిన వేసిన వారంతా ఇప్పుడు ఎవరివైపు వెళ్తారనే ఆందోళన నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో ద్విముఖ పోరు ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్యన పోటీ ఆసక్తికరంగా మారింది. ఎవరి ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయనేది అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని