logo

సబ్బండ వర్గాల ఓటర్లపై గురి

రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల ఓట్లే లక్ష్యంగా నారాయణపేటలో కాంగ్రెస్‌ నిర్వహించిన జన జాతర సభ కొనసాగింది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివిధ వర్గాలకు పలు హామీలను గుప్పిస్తూ కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు.

Updated : 16 Apr 2024 05:43 IST

జన జాతర సభలో భాజపాను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శలు

ప్రసంగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, మహబూబ్‌నగర్‌-నారాయణపేట, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల ఓట్లే లక్ష్యంగా నారాయణపేటలో కాంగ్రెస్‌ నిర్వహించిన జన జాతర సభ కొనసాగింది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివిధ వర్గాలకు పలు హామీలను గుప్పిస్తూ కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగంలో సబ్బండ వర్గాల ప్రస్తావనే ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదిస్తే ముదిరాజ్‌ బిడ్డను ఆగస్టు 15 లోగా మంత్రిని చేస్తానని అనడంతో పక్కనే ఉన్న మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్‌ కాళ్లు మొక్కారు. ముదిరాజ్‌లను బీసీ-డి నుంచి బీసీ-ఏ లోకి మార్చాలంటే కేంద్రంలో పోరాడే వంశీచంద్‌రెడ్డి వంటి నాయకుడు ఎంపీగా ఉండాలని ఆయన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. దళితుల ఏబీసీడీ వర్గీకరణ కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యమవుతుందని ఆ సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కుర్వ యాదవులకు టిక్కెటు ఇస్తే భారాస, భాజపాలు ఒక్కటై ఓడగొట్టారని విమర్శలు గుప్పించారు. షాద్‌నగర్‌లో రజకులకు పార్టీ టిక్కెటు ఇచ్చి గెలిపించిందన్నారు. కాంగ్రెస్‌ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాలమూరు జిల్లాలో వివిధ వర్గాలకు టిక్కెటు కేటాయించిందని ప్రజలకు వివరించి వారి మద్దతు కోరే ప్రయత్నం చేశారు.

సభా వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, గుర్నాథరెడ్డి, శివకుమార్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పర్నికరెడ్డి, శ్రీహరి, ప్రశాంత్‌రెడ్డి, శంకర్‌

సీఎంకి ఘన స్వాగతం..: సీఎం సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నారాయణపేట రావడంతో జిల్లా ఎమ్మెల్యేలు పర్నికరెడ్డి, శ్రీహరి సీఎంకు ఘన స్వాగతం పలికారు. సభ ముగిసే వరకు పార్టీ సీనియర్‌ నేత కుంభం శివకుమార్‌రెడ్డి సీఎం వెంటే ఉన్నారు. వేదికపై కూర్చున్న ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నేతలను   శాలువాలతో సన్మానించారు. సాయంత్రం 6.30కు సీఎం నారాయణపేట రాగా సభ ప్రాంగణానికి సాయంత్రం 6.55కు వచ్చారు. రాత్రి 7.58కు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రారంభి 36 నిమిషాలు మాట్లాడారు. సభ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే పర్నికరెడ్డి తమ్ముడు అభిజయ్‌రెడ్డి సీఎంకి ఖడ్గాన్ని బహూకరించారు. అనంతరం రోడ్డు మార్గాన సీఎం హైదరాబాద్‌కు బయలుదేరారు.

సభావేదికపై ఆశీనులైన అనిరుధ్‌రెడ్డి, జలంధర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అనిల్‌, ఎన్‌పీ వెంకటేశ్‌, ఈదప్ప, శివకుమార్‌, సరాఫ్‌ నాగరాజు, రాజేందర్‌రెడ్డి తదితరులు

అంతర్గత డ్రైనేజీ వ్యవస్థకు హామీ..: నారాయణపేట ఎమ్మెల్యే పర్నికరెడ్డి పురపాలికలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ కావాలని సీఎంను కోరారు. ఎన్నికల అనంతరం డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోయిల్‌సాగర్‌ తిరుగుజలాల ఆధారంగా ఓ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి కోయిల్‌కొండ మండలానికి సాగు, తాగునీరు అందించాలని కోరారు. ఎమ్మెల్యేలు పర్నికరెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌, అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జితేందర్‌రెడ్డి, కార్పొరేషన్‌ ఛైర్మన్లు గుర్నాథ్‌ రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ వనజమ్మ, స్వర్ణసుధాకర్‌, సరిత పాల్గొన్నారు.

నారాయణపేటలోనే పుట్టి పెరిగానని చెబుతున్న డీకే అరుణ ఈ జిల్లాకు ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా? అంటూ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి ఒక్క ప్రాజెక్టుకైనా అనుమతి తెచ్చారా అని నిలదీశారు. దొరసాని అని తాను వ్యాఖ్యానిస్తే ఆమె ఎందుకు మండిపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఆమె ముమ్మాటికీ దొరసానేనని పునరుద్ఘాటించారు. బడుగు, బలహీనవర్గాలకు ఆమె వ్యతిరేకి అని అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సొంతపార్టీ నాయకులకే వెన్నుపోటు పొడిచి భారాసకు ఓట్లు వేయించారని దుయ్యబట్టారు. జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ను గద్దెదించిన దమ్మున్న నాయకుడు రేవంత్‌రెడ్డని కొనియాడారు. కేసీఆర్‌ కమీషన్ల కోసం జీవోనెం.69 రద్దుచేసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టారన్నారు.

సీఎం రేవంత్‌కు గొర్రెపిల్లను బహూకరిస్తున్న కురుమలు

భారాస-భాజపా ఒక్కటే అంటూ..: సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్‌ నేతలు భాజపానే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. భారాస, భాజపా కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. డీకే అరుణ గెలుపు కోసం భారాస పని చేస్తోందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను ఓడించడానికి కుట్ర చేస్తున్నాయని తరచూ విమర్శలు గుప్పించారు. భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణపై పలు విమర్శలు గుప్పించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా, రైల్వే ప్రాజెక్టులు, సైనిక్‌ స్కూల్‌ గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అంటూ  అరుణకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. వంశీచంద్‌రెడ్డి సైతం డీకే అరుణపై తీవ్ర విమర్శలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని