logo

నాయకా.. అభివృద్ధి పనుల్లో ఏదీ కదలిక?

అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలో నాయకులు తామిచ్చిన వాగ్దానాలను కార్యరూపంలోకి తేవడంలో విఫలమవుతున్నారు.

Published : 18 Apr 2024 04:05 IST

గతేడాది బ్యారేజీ కోసం కృష్ణానదిలో ఎమ్మెల్సీ తదితరుల స్థల పరిశీలన

అలంపూర్‌, న్యూస్‌టుడే: అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలో నాయకులు తామిచ్చిన వాగ్దానాలను కార్యరూపంలోకి తేవడంలో విఫలమవుతున్నారు. ఎన్నికల సమయంలో పలు పనులు చేపడతామని వారు తెలుపుతున్నా వాస్తవానికి జరగడంలేదు. వీటిపై కనీస ప్రయత్నం చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

జోగులాంబ బ్యారేజీ: అలంపూర్‌ మండలం గొందిమల్ల - చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామాల మధ్య బ్యారేజీ నిర్మించాలంటూ ఏడాది కిందట ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్థల పరిశీలన చేశారు. కృష్ణానదిపై 40 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించాలనేది అప్పటి సీఎం కేసీఆర్‌ ఆలోచనని ఓ సందర్భంలో ఎమ్మెల్పీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కదలికా లేదు. బ్యారేజీ పూర్తిగా తెలంగాణ ప్రాంతంలోనే ఉంటుందని నీటి మునక కింద ఒక్క ఎకరా పట్టాపొలం కూడా పోయేందుకు ఆస్కారం లేకుండా దీన్ని నిర్మించవచ్చని తెలిపారు. దీంతో అలంపూర్‌, కొల్లపూర్‌ ప్రాంతాలకు తాగు, సాగు నీటి అవసరాలు తీరుతాయనుకున్నారు. అందుకోసం అధికారులు సర్వే చేసి డీపీఆర్‌ నివేదికను అందజేస్తారనీ వివరించారు. నిధులు మంజూరు చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్సీ వెల్లడించారు. అప్పట్లో ఏమీ జరగలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. మరి ఈ ప్రభుత్వంలో దాన్ని సాధించడం అయ్యే పనేనా అనే చర్చ నడుస్తోంది. అప్పట్లో బ్యారేజీకి ఇరిగేషన్‌ శాఖ అధికారులు తాత్కాలికంగా జోగులాంబ పేరు నిర్ణయించినట్లు తెలిపారు.

పెండింగ్‌ పనులేమైనట్లో..: వడ్డేపల్లి మండలంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో మల్లమ్మకుంట రిజర్వాయర్‌ పనులు చేపడతామని ఎమ్మెల్సీతోపాటు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ కూడా వాగ్దానాలు చేశారు. అక్కడా కదలిక లేదు. అలాగే ఆర్డీఎస్‌ పనులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరిస్తామని సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయన వీటిపై దృష్టి సారిస్తే బాగుంటుందని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. నెట్టంపాడు 100వ ప్యాకేజీ పెండింగు పనులు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి అప్పటి మంత్రి నిరంజన్‌రెడ్డితో మాట్లాడి అదనంగా అయ్యే రూ.300 కోట్లు మంజూరు చేయిస్తామని చల్లా పేర్కొన్నారు. నెట్టంపాడు పనులు పూర్తయితే ఆర్డీఎస్‌కు అయిజ వద్ద అనుసంధానమయ్యే కాలువ ద్వారా అలంపూర్‌కు నీళ్లు అందే అవకాశముంటుంది. అదీ అంతే ఒక్క అడుగు ముందుకు పడలేదు.

నియోజకవర్గ అభివృద్ధి: వచ్చే అయిదేళ్లలో అలంపూర్‌ నియోజకవర్గానికి జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, వెటర్నరీ వంటి కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తామని, వచ్చే అయిదేళ్లలో అలంపూర్‌, ఇటిక్యాల, వడ్డేపల్లి, మానవపాడు మండలాలు పచ్చదనంతో కనిపిస్తాయని నాయకులు పేర్కొన్నారు. మరి వీటిని సాధించడంలో వీరు ఎంతవరకు కృతకృత్యులయ్యారనే దానిపైనే నియోజకవర్గ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని