logo

అంగన్‌‘వేడి’

రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు.

Updated : 19 Apr 2024 06:37 IST

ఎండలకు అల్లాడుతున్న చిన్నారులు

రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు.

గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 సెల్సియస్‌ డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్గొండలో బుధవారం 45.1 డిగ్రీలు నమోదైంది. ఇళ్లల్లో ఉండే ప్రజలే ఉక్కపోతతో అల్లాడుతుండగా, రేకుల గుడిసెలు, ఇరుకైన అద్దె గృహాలు, గాలిరాని భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే 3 నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులు పరిస్థితి ఊహిస్తేనే భయమేస్తోంది. మధ్యాహ్న భోజనం చేసేందుకు వచ్చే గర్భిణులు, బాలింతలు సైతం ఉక్కపోతతో తల్లడిల్లుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహిస్తున్నప్పటికీ, మధ్యాహ్నం వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చినట్లుగా, వీటికీ సెలవులు ఇచ్చి, పోషకాహారం ఇంటికి అందించేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి : ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 4,321 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం పేరుతో గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందజేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా కేంద్రాలకు సరైన భవనాలు లేకపోవడం సమస్యగా మారింది. దాదాపు 60 శాతం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ఇరుకైన అద్దె గృహాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. సొంత భవనాలున్న చోట విద్యుత్తు సౌకర్యం లేదు. దీంతో పంకాల ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయింది. మధ్యాహ్నం భోజనం వేడిగా ఇస్తుండటంతో ఉక్కపోతతో తినలేకపోతున్నారు. నిద్రించే సమయంలో గాలి రాక అల్లాడుతున్నారు. అద్దె భవనాలు కావడంతో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రమై కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆయా కేంద్రాల టీచర్లు వాపోతున్నారు.

  • జోగులాంబ గద్వాల జిల్లాను తీసుకుంటే.. మూడు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 713 కేంద్రాలున్నాయి. వీటిలో 120కి మాత్రమే సొంత భవనాలుండగా, మిగిలినవి అద్దె భవనాలు, పాఠశాల భవనాల్లో నిర్వహిస్తున్నారు. సొంత భవనాల్లో 80కి పైగా కేంద్రాలకు విద్యుత్తు సౌకర్యం లేదు.
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 529 కేంద్రాలకు సొంత భవనాలుండగా, 193 అద్దె భవనాల్లో, ఉచిత అద్దె భవనాల్లో 409 నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఇరుకైన అద్దె భవనాలు ఉండటంతో గాలి రాక చిన్నారులు అల్లాడుతున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి.

సమస్యను నివేదిస్తాం

-సుధారాణి, డీడబ్ల్యూవో, గద్వాల

అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం, ఎండల నేపథ్యంలో సెలవులు ఇచ్చే అంశాన్ని ఎన్నికలు ముగిశాక ఉన్నతాధికారుకు నివేదిస్తాం. ప్రస్తుతానికి అన్ని కేంద్రాల్లో తప్పనిసరిగా 15 రోజుల టీచర్‌, మరో 15 రోజులు ఆయా అందుబాటులో ఉండి పోషకాహారం అందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని