logo

ఇథనాల్‌ పాపం భాజపా, భారాసలదే

కేంద్రం, రాష్ట్రంలోని భాజపా, భారాస ప్రభుత్వాల అనుమతులతోనే మరికల్‌ మండలం చిత్తనూరు శివారులో అప్పట్లో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటైందని మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు.

Published : 30 Apr 2024 05:35 IST

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి 

కన్మనూర్‌లో మాట్లాడుతున్న వంశీచంద్‌రెడ్డి

మరికల్‌ (ధన్వాడ), న్యూస్‌టుడే : కేంద్రం, రాష్ట్రంలోని భాజపా, భారాస ప్రభుత్వాల అనుమతులతోనే మరికల్‌ మండలం చిత్తనూరు శివారులో అప్పట్లో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటైందని మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. సోమవారం కన్మనూర్‌, ఏక్లాస్‌పూర్‌, జిన్నారం గ్రామాల్లో మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కన్మనూర్‌లో ప్రచార రథం నుంచి ఆయన ప్రసంగిస్తుండగా ఇథనాల్‌ కంపెనీ గురించి ప్రజలు ప్రస్తావించినప్పుడు పై విధంగా వ్యాఖ్యానించారు. కంపెనీ రద్దు కావాలంటే ఓట్లు అడిగేందుకు వచ్చే భాజపా, భారాస నాయకుల్ని నిలదీయాలన్నారు. ఆ పార్టీలు రెండుచోట్లా అధికారంలో ఉన్నప్పుడే కంపెనీఏర్పాటయ్యిందన్నారు. వారిని ప్రశ్నించకుండా తనను అడగడం సరైంది కాదంటూ ఎన్నికల్లో గెలిపిస్తే కంపెనీ రద్దుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఇదే సమావేశంలో ఓ యువకుడు అగస్టు 15 లోపు రూ. రెండు లక్షల రుణాన్ని మాఫీˆ చేయకపోతే అగస్టు 20న రైతుల తరపున ధర్నా చేస్తామనగా, మీరేందుకు చేయాలి... నేనే ధర్నాకు దిగుతానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బదులిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను ఆదరించాల్సిందిగా కోరారు. ఈ సమావేశాల్లో పేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని