logo

గెలుపు ఖాయం.. భారీ మెజార్టీయే లక్ష్యం

సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావటంతో ఇక్కడి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ సూచించారు.

Published : 30 Apr 2024 05:42 IST

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ 

విలేకరులతో మాట్లాడుతున్న దీపాదాస్‌ మున్షీ, చిత్రంలో ఎమ్మెల్యేలు  యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

పాలమూరు, న్యూస్‌టుడే : సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావటంతో ఇక్కడి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ సూచించారు. ఉమ్మడి జిల్లాల్లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని, మెజార్టీ పెంచటమే లక్ష్యంగా కృషిచేయాలని కోరారు. సోమవారం మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఆమె ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలమూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు కొద్ది రోజులే గడువు ఉందని, అన్ని ప్రాంతాల్లో సమర్థంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి వార్డులో బూత్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని, పార్టీ బలోపేతానికి చేరికలను ప్రోత్సాహించాలని సూచించారు. పోటీ చేసే ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఎం ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, ఎవరూ తేలికగా తీసుకోవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరేలా చూడాలన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయని, తెలంగాణలో ఎక్కువ స్థానాలు సాధించే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ. 400 వేతనం, ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ. లక్ష సహాయం అందించే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

వ్యక్తిగత దూషణ ప్రధానికి తగదు

ప్రధాని మోదీ తరచూ తమ అగ్రనేత రాహుల్‌ గాంధీని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, ఇది ఆయన హోదాకు తగదని దీపాదాస్‌ మున్షీ అన్నారు. సమీక్ష తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని మొదట భాజపా ఎంపీలే చెప్పారని, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్నారు. రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చినా న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని, భయపడే ప్రసక్తే లేదన్నారు. మున్షీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్‌, శివనాథ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, డా.పర్ణికారెడ్డి, శ్రీహరి, అనిరుధ్‌రెడ్డి, శంకర్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి, సాట్స్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఓబీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీకాంత్‌గౌడ్‌, షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని