logo

ఏ సభలో ఎంత మంది సభ్యులు?

భారత పార్లమెంట్‌లో రెండు సభలు ఉంటాయి. దిగువ సభను లోక్‌సభ అంటారు. దీనినే ప్రజా ప్రతినిధుల సభ అని కూడా పిలుస్తారు. ఈ సభలో మొత్తం 552 మంది సభ్యులు ఉంటారు.

Updated : 30 Apr 2024 06:36 IST

లోక్‌సభలో 552 

అచ్చంపేట, మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : భారత పార్లమెంట్‌లో రెండు సభలు ఉంటాయి. దిగువ సభను లోక్‌సభ అంటారు. దీనినే ప్రజా ప్రతినిధుల సభ అని కూడా పిలుస్తారు. ఈ సభలో మొత్తం 552 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 530 మంది లోక్‌సభ సభ్యులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికల బరిలో నిలిచి ప్రజలతో ప్రత్యక్ష ఓటింగ్‌ పద్ధతిలో ఎన్నికవుతారు. మరో 20 మంది సభ్యులు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు. వీరి పదవీ కాలం అయిదేళ్లు ఉంటుంది. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో లోక్‌సభను రద్దు చేసే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కాకుండానే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. సభలోని సభ్యుల నుంచి ఒకరిని సభాపతిగా ఎన్నుకుంటారు. అతడికి సహాయకుడిగా ఉప సభాపతిని కూడా ఎన్నుకుంటారు. వీరిని లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌గా పిలుస్తారు. సాధారణంగా లోక్‌సభ ఏడాదిలో మూడు సార్లు సమావేశమవుతుంది. వివిధ అంశాలపై సభలోని సభ్యులు చర్చించేందుకు అవకాశం ఉంటుంది.

రాజ్యసభలో 250 మంది సభ్యులు : భారత పార్లమెంట్‌లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల ద్వారా రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు. అందుకే రాజ్యసభను రాష్ట్రాల సభ అని కూడా వ్యవహరిస్తారు. ఈ సభలో 250 మంది సభ్యులు ఉంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ్యుల సంఖ్యను బట్టి రాజ్యసభ స్థానాలను కేటాయిస్తారు. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. వీరిలో 12 మందిని వివిధ రంగాల్లో (సేవ, విజ్ఞానం, కళలు, భాష) నిపుణులైన వారిలో అత్యున్నత సేవలందించిన వారిని రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా నామినేట్‌ చేస్తారు. రాజ్యసభకు ఉప రాష్ట్రపతి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా సభ్యుల్లో నుంచి ఒకరిని ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు ఉంటుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 1/3వ వంతు సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. ఏర్పడిన ఖాళీలను రాష్ట్రాల వారీగా మళ్లీ భర్తీ చేస్తారు. చట్టాలను తయారు చేయడంలో లోక్‌సభతో సమానంగా రాజ్యసభకు కూడా అధికారాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని