logo

సార్వత్రికం... తీర్పు ప్రత్యేకం

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో శాసనసభకు, పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది.

Published : 30 Apr 2024 06:34 IST

అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లలో మార్పు 

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో శాసనసభకు, పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. ఇక్కడ 2018లో అసెంబ్లీ, 2019లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ సారి కూడా వేర్వేరుగా శానససభకు, లోక్‌సభకు ఎన్నికలొచ్చాయి. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల వారీగా నమోదైన ఓటింగ్‌ శాతమే ఈ సార్వత్రిక ఎన్నికల్లో వస్తుందా? గత ఎన్నికల్లో మాదిరిగా ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇస్తారా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. 2018లో అప్పటి భారాస ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. నాలుగు నెలల తర్వాత లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో చాలా వ్యత్యాసం ఉంది. 2018 డిసెంబరులో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారాసకు ప్రజలు జై కొట్టారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు స్థానాల్లోనూ ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో భారాసకు 50.10 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 25.60 శాతం, భాజపాకు 5.44 శాతం ఓట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారాసకు 41.79 శాతం, కాంగ్రెస్‌కు 19.66 శాతం, భాజపాకు 33.85 శాతం ఓట్లు పోలయ్యాయి. నాలుగు నెలల వ్యవధిలోనే భారాసకు 8.31 శాతం, కాంగ్రెస్‌కు 5.94 శాతం ఓట్లు తగ్గాయి. భాజపాకు 28.41 శాతం ఓట్లు పెరిగాయి. 2019లో కేంద్రంలో ప్రధాని మోదీ హవా ఉండటంతో ప్రజలు భాజపా వైపు మళ్లారు. మహబూబ్‌నగర్‌, మక్తల్‌, నారాయణపేట సెగ్మెంట్లలో భాజపా మొదటి స్థానంలో నిలిచింది. జడ్చర్ల, షాద్‌నగర్‌, కొడంగల్‌, దేవరకద్ర సెగ్మెంట్లలో భారాసకు మెజార్టీ వచ్చింది.  

ఈ సారి పరిస్థితి..: 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాన పార్టీల పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఈ సారి ఏడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. 2018లో భారాసకు ఉన్న పరిస్థితి 2023కు వచ్చే సరికి కాంగ్రెస్‌కు వచ్చింది. 2023లో జరిగిన శానసభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో పార్టీలకు వచ్చిన ఓటు బ్యాంకు తిరిగి వస్తుందా..? లేదా? 2019లో మారినట్లు ఓట్ల శాతంలో మార్పులు ఉంటాయా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో భారాసకు 38.74 శాతం, కాంగ్రెస్‌కు 46.35%, భాజపాకు 8.56 % ఓట్లు పోలయ్యాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చిన ఓటు బ్యాంకు మారే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు కావడంతో పార్టీలకు పడే ఓటు బ్యాంకులోనే తేడా ఉండే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ ఈ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవాలన్న ఉత్సాహంలో ఉంది. ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చేలా నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. దేశవ్యాప్తంగా మోదీ హవా ఉందని.. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని భాజపా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్లుగానే కాషాయ శ్రేణులు శ్రమిస్తున్నాయి. భారాస కూడా గట్టి పోటీ ఇస్తుంది. 2023లో శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు బ్యాంకు తగ్గినా ఈ ఐదు నెలల్లో పరిస్థితి మారిందని, ప్రజలు మళ్లీ భారాస వైపే ఉన్నారని ఆ పార్టీ ముఖ్యులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని