logo

అమ్మాయిలదే పైచేయి!

పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కాగా జిల్లాలో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొత్తం 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,338 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,416కి గాను 5,604 మంది (87.34 శాతం), బాలికలు 6,257కు గాను 5,734 మంది (91.64శాతం) ఉత్తీర్ణత సాధించారు.

Updated : 01 May 2024 06:57 IST

పది ఫలితాల్లో జిల్లాకు  28వ స్థానం

టీచర్లను సర్దుబాటు చేసినా కనిపించని ప్రభావం

 

జీపీఏ 10 సాధించిన వెన్నచేడ్‌ ఆదర్శ పాఠశాల విద్యార్థిని పల్లవిని అభినందిస్తున్న కలెక్టర్‌, డీఈవో, సీఎంవో, ఏఎంవో

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కాగా జిల్లాలో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొత్తం 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,338 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,416కి గాను 5,604 మంది (87.34 శాతం), బాలికలు 6,257కు గాను 5,734 మంది (91.64శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ, జడ్పీ పాఠశాలలు పదికి పది జీపీఏ సాధించలేకపోయాయి. 2023లో ఉత్తీర్ణత శాతం 71.25 ఉండగా ఈ ఏడాది కాస్తా మెరుగుపడి 89.47 శాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని గతేడాది జూన్‌లోనే ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా ఫలితాలు అనుకున్న స్థాయిలో రాలేదు. 83 పాఠశాలలు (గురుకులాలు, ఆదర్శ, కస్తూర్బా విద్యాలయాలు-కేజీబీవీ) 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.

 182 మందికి 10 జీపీఏ : ఈ ఏడాది జిల్లాలో మొత్తం 182 మందికి 10 జీపీఏ వచ్చింది. వీటిలో మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల విద్యాలయాల విద్యార్థులు 14 మంది ఉండగా.. టిమ్రిస్‌ (మైనారిటీ గురుకులం) విద్యార్థులు నలుగురు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఒకరు, టీఎస్‌ గురుకులం(బాలికలు)లో ఇద్దరు, ఆదర్శ పాఠశాలలో ఒకరు చొప్పున 10 జీపీఏ సాధించారు. మిగిలిన వారంతా ప్రైవేటు విద్యార్థులే కావడం గమనార్హం. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఒక్కరికి కూడా 10 జీపీఏ రాకపోవడం విడ్డూరం. గతేడాది 2023లో 85 మంది, 2022లో 255 మంది జీపీఏ సాధించారు. 2021లో 5,231, 2020లో 3,399, 2019లో 113 మంది 10 జీపీఏ సాధించారు.

100 శాతం ఇక్కడే : జిల్లాలో మొత్తం 14 కేజీబీవీలు ఉండగా ఐదింటిలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీసీకుంట కేజీబీవీలో 41, జడ్చర్లలో 31, కోయిలకొండలో 36, మహబూబ్‌నగర్‌ రూరల్‌లో 44, రాజాపూర్‌లో 47 చొప్పున పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. 

  • ఎస్సీ గురుకులాలు ఐదు ఉండగా ఐదింటిలోనూ 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాంరెడ్డిగూడెం(బాలికలు)లో 78, జడ్చర్ల (బాలికలు)లో 78, నంచర్ల (బాలికలు)లో 79, దేవరకద్ర(బాలుర)లో 75, బాలానగర్‌(బాలుర)లో 79 మంది చొప్పున పరీక్ష రాయగా అందరూ పాసయ్యారు.
  • బీసీ గురుకులాలు ఏడు ఉండగా ఆరింటిలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సీసీకుంటలో 74, నవాబుపేటలో 70, కోయిలకొండలో 71, భూత్పూరులో 79, మన్యంకొండలో 70, హన్వాడలో 75 మందికి గాను అందరూ ఉత్తీర్ణత సాధించారు. గిరిజన గురుకులాలు రెండు ఉండగా టీటీడబ్ల్యూయూ ఆర్‌జేసీ మహబూబ్‌నగర్‌ (బాలికలు)లో 89 మందికి గాను అందరూ ఉత్తీర్ణత సాధించారు. 
  • మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డలోని అంధుల పాఠశాల విద్యార్థులందరూ పాసయ్యారు.
  • బాలానగర్‌లోని టీఎస్‌ బాలికల గురుకులంలో 76 మందికి అందరూ ఉత్తీర్ణత సాధించారు. 

జడ్పీహెచ్‌ఎస్‌ సూరారం (కోయిలకొండ), మల్కాపూర్‌(కోయిలకొండ), గండీడ్‌ మండల కేంద్రం, హన్వాడ మండలంలోని గుండ్యాల్‌, మునిమోక్షం, వేపూర్‌(ఉర్దూ మాధ్యమం), గోపన్‌పల్లి(దేవరకద్ర), కొల్లూరు(నవాబుపేట), పోమాల్‌(నవాబుపేట), బాదేపల్లి(ఉ.మా.), గొల్లపల్లి(జడ్చర్ల) పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.
యాజమాన్యాల వారీగా : జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 81.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ పాఠశాలలు-77.73, కేజీబీవీలు-93.98, ఆదర్శ పాఠశాల-98.92, ప్రైవేటు పాఠశాలలు-97.71, మినీ గురుకులాలు-96.14, గిరిజన గురుకులాలు-98.86, ఎయిడ్‌ పాఠశాలల్లో 94.10 శాతం చొప్పున ఉత్తీర్ణత నమోదైంది.
అట్టడుగు పాఠశాలలివే.. : మహబూబ్‌నగర్‌ పట్టణం వీరన్నపేట ఉర్దూ పాఠశాలలో అత్యంత తక్కువగా ఉత్తీర్ణత 35 శాతం నమోదైంది. మహమ్మదాబాద్‌ జడ్పీహెచ్‌ఎస్‌ ఉర్దూ మీడియంలో 37.50 శాతం, జడ్పీహెచ్‌ఎస్‌ ఎల్కిచర్లలో 41.30 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని