logo

కొలిక్కి వచ్చిన వివాహిత హత్య కేసు

మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ యోగేశ్‌గౌతం వివరాలను మంగళవారం విలేకరులకు తెలియజేశారు..

Updated : 01 May 2024 06:59 IST

నిందితుడికి రిమాండ్‌

 

వివరాలు వెల్లడిస్తున్న ఎసీˆ్ప యోగేశ్‌గౌతం, డీఎస్పీనల్లపు లింగయ్య, సీఐ శివశంకర్‌

నారాయణపేట, న్యూస్‌టుడే: మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ యోగేశ్‌గౌతం వివరాలను మంగళవారం విలేకరులకు తెలియజేశారు.. దామరగిద్ద లక్ష్మీనగర్‌కాలనీకి చెందిన లక్ష్మప్ప భార్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందింది. కూతురికి పెళ్లిచేయగా ప్రస్తుతం ఆమె కర్ణాటకలో ఉంటోంది. మిగతా పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఒంటరిగా ఉంటూ మేస్త్రీ పనులతో జీవనం వెళ్లబుచ్చుతున్నాడు. ఈనెల 25న దుకాణంలో కల్లు తాగుతుండగా ఒక మహిళ చిన్న పిల్లతో వచ్చి కల్లుపోయించాలని అడిగింది. చిన్నపిల్లను ఇంటివద్ద వదిలినట్లైతే కల్లు తాగిస్తానని చెప్పడంతో కూతురిని పక్కింటిలో వదిలి మధ్యాహ్న 2గంటలకు లక్ష్మప్ప ఇంటికి వచ్చింది. ఆమెను అక్కడే ఉంచి దుకాణానికి వెళ్లి కల్లుతెచ్చిన లక్ష్మప్ప ఆమెతో తాగించాడు. మద్యం మత్తులో కోరిక తీర్చాలని ఒత్తిడి తేవడంతో ఆ మహిళ నిరాకరించింది. ఈ విషయం బయటకు చెబుతుందనే భయంతో రాత్రి 2గంటల ప్రాంతంలో ఇంట్లో నిద్రించిన మహిళపై గొడ్డలితో బలంగా కొట్టాడు. గాయమై కొంతసేపటికి మృతిచెందింది. 26న తెల్లవారు జామున ఇంట్లోనే మృతదేహం ఉంచి కర్ణాటకలోని క్యాసారంలో బంధువుల పెళ్లికి వెళ్లి గ్రామానికి వచ్చాడు. ఇంట్లో మృతదేహం దుర్వాసన వస్తుండటంతో భయపడి పోలీసులకు పోన్‌చేసి  గుర్తు తెలియని వ్యక్తులు మహిళను హత్యచేసి తన ఇంట్లో పడేసినట్లు సమాచారం అందించాడు. డీఎస్పీ ఎన్‌.లింగయ్య ఆధ్వర్యంలో సీఐ శివంకర్‌, ఎస్‌ఐ వసంత, సిబ్బంది నిందితుడిని పట్టుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, తన సెల్‌ఫోన్లను నిందితుడు పోలీసులకు అప్పగించాడు. అతడిని అరెస్టుచేసి జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.


లాడ్జిలో యువకుడి అనుమానాస్పద మృతి

అమీర్‌పేట, జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే : ఓ లాడ్జిలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ నగరం ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై శ్రావణ్‌కుమార్‌ కథనం ప్రకారం... జడ్చర్ల పట్టణం గౌరీశంకర్‌కాలనీకి చెందిన హేమంత్‌ (28) ఇటుకల వ్యాపారం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి(27)తో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడగా.. అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై రాత్రి ఎస్సార్‌నగర్‌లోని టౌన్‌హౌస్‌లో గది తీసుకొని బస చేశారు. మద్యం తాగి హేమంత్‌ రాత్రి 2 గంటల ప్రాంతంలో బాత్రూంకు వెళ్లాడు. ఎంతకు బయటకు రావటం లేదని యువతి చూడగా అపస్మారక స్థితిలో పడి కనిపించాడు. యువతి.. హేమంత్‌ స్నేహితులకు సమాచారం ఇచ్చింది. స్నేహితులు వచ్చి 108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది పరీక్షించి హేమంత్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న హేమంత్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని దర్యాప్తు చేయాలని కోరారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని