logo

శెభాష్‌.. పేట

పదోతరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణపేట జిల్లా ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో మొదటి సారిగా ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పది జీపీఏలు వచ్చాయి.

Published : 01 May 2024 06:55 IST

 ‘పది’ ఫలితాల్లో రాష్ట్ట్ర్రంలో 15వ స్థానం

ఉమ్మడి పాలమూరులో ప్రథమం

 24 ప్రభుత్వ బడులు నూరుశాతం

 93.13శాతంతో ప్రభంజనం

డీఈవో అబ్దుల్‌ ఘనికి మిఠాయి తినిపిస్తున్న జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది

న్యూస్‌టుడే, నారాయణపేట పట్టణం: పదోతరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణపేట జిల్లా ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో మొదటి సారిగా ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పది జీపీఏలు వచ్చాయి. 93.13 శాతం ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్రస్థాయిలో 15వ స్థానం జిల్లా సాధించింది. బాలురు 90.99, బాలికలు 95.02 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇంటర్‌ ఫలితాల్లోలాగే పదోతరగతిలోనూ బాలికలదే పైచేయి.  జిల్లాలో మొత్తం 7,655 మంది పరీక్షలకు హాజరుకాగా 7,129 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,598 మంది పరీక్షలకు హాజరుకాగా 3,274 మంది పాసయ్యారు. బాలికలు 4,057 మంది పరీక్షలు రాయగా 3,855 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 19 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో 42 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.

75.07 శాతం నుంచి...

2023లో 75.07 శాతం ఉత్తీర్ణత సాధిస్తే ఈ ఏడాదిలో 93.13 శాతం ఫలితాలు వచ్చి ఔరా అనిపించాయి.  గత ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా ప్రస్తుత మొదటి స్థానంలోకి వెళ్లింది. గత ఏడాదిలో రాష్ట్ర స్థాయిలో 31వ స్థానం సాధిస్తే ఈ ఏడాది 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో నాగర్‌కర్నూల్‌ జిల్లా 91.57, మహబూబ్‌నగర్‌ 89.47, వనపర్తి 86.93, జోగులాంబ గద్వాల జిల్లా 81.38 శాతం సాధించగా నారాయణపేట 93.13 శాతం సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది.  526 మంది ఉత్తీర్ణులు కాలేదు. ఇందులో కొందరు పరీక్షలకు హాజరుకాలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.

అనుభవాలే పాఠాలు

గత ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలకు 7,541 మంది విద్యార్థులు హాజరుకాగా 1,880 మంది తప్పారు. ఎక్కువమంది గణితంలో వెనుకబడ్డారు. ఆ అనుభవాన్ని పాఠంగా తీసుకున్న జిల్లా యంత్రాంగం మొదటి నుంచే బోధనపై గట్టిగా దృష్టిసారించింది. ప్రతి విద్యార్థిపై ఫోకస్‌ ఉండేటట్లు కలెక్టరు శ్రీహర్ష ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది 23 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్‌ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. జక్లేర్‌, గున్ముక్ల, నర్వ, పులిమామిడి, బిజ్వార్‌, కంసాన్‌పల్లి, ఉందేకోడ్‌, బొమ్మన్‌పాడ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. కేజీబీవీలు 6, మైనార్టీ గురుకులం 1, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు 5, మహాత్మ జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలు 3, వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.  

విజయాల వెల్లువ

  •  నారాయణపేట మైనార్టీ గురుకుల పాఠశాలలో 46 మంది విద్యార్థులకు పూర్తిగా పాసయ్యారు. ఇద్దరు పది జీపీఏ సాధించారు.
  • కొండాపూర్‌ గిరిజన గురుకులం విద్యార్థులు 77 మంది పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. ముగ్గురు పది జీపీఏలు సాధించారు
  •  మరికల్‌ సాంఘిక సంక్షేమ గురుకులంలోనూ వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ధన్వాడ బాలురు, మరికల్‌ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలల్లోనూ 90 శాతానికి పైగా ఫలితాలు వచ్చాయి.
  •  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు కొనసాగుతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో 38 మందికి 38 మంది. తెలుగు మాధ్యమంలో 40 మంది విద్యార్థులకు 35 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆంగ్ల మాధ్యమంలో జి.వైష్ణవి 10 జీపీఏ సాధించింది.
  •  మహాత్మ జ్యోతిబా ఫులే వెనబడిన తరగతుల గురుకుల పాఠశాల కోటకొండ(మరికల్‌)లో 75 మందీ పాసవ్వడం, అందులో  ఐదుగురు 10 జీపీఏ, 46 మంది విద్యార్థులు 9కి పైగా జీపీఏ సాధించడం విశేషం.

    కలెక్టరు చొరవ, ఉపాధ్యాయుల కృషి ఈ విజయం: డీఈవో

నారాయణపేట పట్టణం, న్యూస్‌టుడే : ఉమ్మడి పాలమూరులో నారాయణపేట జిల్లా పదో తరగతి ఫలితాలలో 93.13 శాతంతో మొదటి స్థానంలో, రాష్ట్ర స్థాయిలో 15వ స్థానంలో నిలవడం పట్ల డీఈవో అబ్దుల్‌ ఘని ఆనందం వ్యక్తం చేశారు విద్యాశాఖ కార్యాలయంలో మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చొరవతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించామన్నారు. ప్రణాళికతో సబ్జెక్టుల వారిగా బోధన, పరీక్షలను నిర్వహించి వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. ప్రభుత్వ పరీక్షల జిల్లా సహాయ అధికారి రమేశ్‌ శెట్టి, సెక్టోరియల్‌ అధికారులు నాగార్జునరెడ్డి, శ్రీనివాస్‌, జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాశ్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని