logo

అంజన్నా! నీ భూమి కాపాడుకో

అటు రాయచూరు, ఇటు జిల్లా కేంద్రం నారాయణపేట, మరోవైపు మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ వెళ్లడానికి చక్కని రవాణా సదుపాయం ఉన్న పట్టణం మక్తల్‌... అంతే కాదు వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఈ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.

Published : 06 May 2024 04:58 IST

మక్తల్‌  పడమట ఆంజనేయస్వామి ఆలయ స్థలం

న్యూస్‌టుడే- మక్తల్‌ గ్రామీణం: అటు రాయచూరు, ఇటు జిల్లా కేంద్రం నారాయణపేట, మరోవైపు మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ వెళ్లడానికి చక్కని రవాణా సదుపాయం ఉన్న పట్టణం మక్తల్‌... అంతే కాదు వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఈ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మున్సిపాలిటీ అయ్యాక ఇక్కడి స్థలాలకు గిరాకీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.

మక్తల్‌ పట్టణంలో రూ.కోట్ల విలువ చేసే శ్రీ పడమట ఆంజనేయస్వామి ఆలయ స్థలం ఆక్రమణకు కొందరు రంగం సిద్ధం చేస్తున్నారు. పలుకుబడి ఉన్న నాయకులు వెనుక ఉండి పావులు కదుపుతున్నారు. పట్టణం నడిబొడ్డున హైదరాబాద్‌, రాయచూరు జాతీయ రహదారి 167 పక్కన ఆలయానికి రూ.8కోట్ల విలువచేసే అర ఎకరం స్థలం ఉంది. ముందుగా ఈ స్థలంలో చిన్న డబ్బాలు వెలిశాయి. వీటిని అద్దెకు ఇచ్చి కొందరు సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో ఆలయ యంత్రాంగం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.  

రెండేళ్ల క్రితం రోడ్డు విస్తరణలో పురపాలిక అధికారులు డబ్బాలు తొలగించినా, దేవస్థానం స్థలాన్ని స్వాధీనం చేసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మళ్లీ అదే స్థలంలో కొందరు చిరు వ్యాపారులు గుడారాలు వేసుకున్నారు. పోనీ పేద జీవితాలు ఏదో ఉపాధి కల్పించుకుంటున్నాయని అనుకుంటే ఆ మాటున కబ్జాదారులు రంగం సిద్ధం చేయడం ఆందోళన కల్గిస్తోంది.  అంజన్న ఆలయానికి మక్తల్‌ పట్టణంలోని సర్వే నంబరు.35లో 8ఎకరాల 20గుంటల భూమి ఉంది. ఆలయం ముందు, రాంలీలా మైదానం వైపు 30ఏళ్ల కిందటే అప్పటి పంచాయతీ అధికారుల నుంచి అనుమతి పొందిన పలువురు ఇండ్లు, దుకాణాలు నిర్మించుకున్నారు. దీనిపై దేవస్థానంవారు కోర్టులో దావా వేశారు. స్వామివారికి పూర్వీకుల నుంచి సేవ చేశామంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ స్థలం మినహాయించినా మిగతా స్థలాన్ని కాపాడుకోడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. హైదరాబాద్‌ -రాయచూరు రహదారిలో గజం విలువ రూ.40వేలు  పలుకుతోంది. అర ఎకరం ఆలయ స్థలం రూ.8కోట్ల పైమాటే ఉంటుంది. రెండేళ్ల క్రితం అప్పటి దేవాదాయ ఈవో రెవెన్యూ విభాగంతో సర్వే చేయించి హద్దులు పాతించారు. అంతలో ఆయన బదిలీ కావడంతో విలువైన ఆ స్థలం దేవస్థానం స్వాధీనపరుచుకోలేదు. పలుకుబడి గల నాయకులు దీన్ని అదునుగా భావించి ఆక్రమణలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఈ స్థలంలో దుకాణాలు నిర్మించి అద్దెకు ఇస్తే దేవస్థానానికి నెలకు రూ.3లక్షలకుపైగా ఆదాయం వస్తుందని ప్రజలు, భక్తులు అంటున్నారు. ఏ మాత్రం అలక్ష్యం చేసినా విలువైన స్థలం చేజారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని