logo

తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం

విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండటం వలన, వివాహ శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లకు తాళాలు వేసి సొంతూరు, ఇతర గ్రామాలు, పట్టణాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు.

Updated : 06 May 2024 06:21 IST

వరుస చోరీలతో బెంబేలు

తిమ్మాజిపేట మండలం గొరిట గ్రామంలో ఓ ఇంట్లో బీరువా పగలగొట్టి దుస్తులు చిందరవందరగా పడేసిన దృశ్యం (పాతచిత్రం)

కందనూలు, న్యూస్‌టుడే : విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండటం వలన, వివాహ శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లకు తాళాలు వేసి సొంతూరు, ఇతర గ్రామాలు, పట్టణాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. గ్రామాల్లోని రైతులు ప్రస్తుతం వరి కోతలు, వివిధ రకాల పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా దొంగలు పట్టణ ప్రాంతాల్లో ఉదయం, మధ్యాహ్న సమయంలో రెక్కీ నిర్వహించి అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో మధ్యాహ్న సమయంలో జనసంచారం తక్కువగా ఉండటం వలన తాళాలు వేసిన నివాసాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. సీసీ కెమెరాల్లో నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో అంతుచిక్కడం లేదు. పలు ప్రాంతాల్లో నిఘా నేత్రాలు ధ్వంసం చేసి చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలో వరుసుగా చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

నాలుగు నెలల్లో 105 చోరీలు..

జిల్లాలో నాలుగు నెలల్లో 105 చోరీలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని వెల్దండ మండలంలో, తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ, బుద్ధసముద్రం, గొరిట, నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు బీసీ కాలనీలో, తాడూరు మండలాల్లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. జనవరి నెలలో 31, ఫిబ్రవరిలో 29, మార్చిలో 21, ఏప్రిల్‌లో 24 చోరీలు నమోదైనట్లు పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు. తాళాలు వేసి నివాసాల్లోనే చోరీలు ఎక్కువగా జరుగుతుండగా దొంగలు బంగారు, వెండి ఆభరణాలు, నగదు భారీగా ఎత్తుకుపోవడం వలన బాధితులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు గస్తీ నిర్వహించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

గ్రామాలు, పట్టణాల్లోని కాలనీల్లో అర్ధరాత్రి సమయంలో, మధ్యాహ్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కన్పిస్తే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలి. వేసవి సెలువుల నేపథ్యంలో ఎక్కువ రోజులు గ్రామాలు, పట్టణాలకు వెళ్లాల్సివస్తే ఆయా కాలనీల్లో రాత్రి గస్తీ పెంచేలా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఊరికి వెళ్లిన సమయంలో బంగారు, వెండి, ఇతర రకాల ఆభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో లేదా సురక్షితమైన ప్రాంతాల్లో భద్రపర్చుకోవాలని పోలీసులు చెబుతున్నారు. కాలనీలో, గ్రామాల్లోని యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించాలి.

వివరాలు సేకరించాం..

సీసీ కెమెరాల్లో నమోదైన చిత్రాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశాం. తిమ్మాజిపేట మండలంలో చోరీలకు పాల్పడిన వ్యక్తుల వివరాలు సేకరించాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. వేసవి కాలంలో చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తే బంగారు ఆభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో దాచుకోవాలి. చోరీలు అరికట్టడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి సమయంలో గస్తీ మరింత పెంచాం.

శ్రీనివాస్‌, డీఎస్పీ, నాగర్‌కర్నూల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని