logo

మరో రెండు రోజులు కొనుగోళ్లు బంద్‌

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి వారం రోజులుగా భారీగా ధాన్యం వస్తోంది. సోమవారం 700 మంది రైతులు వివిధ పంటలు 17,233 క్వింటాళ్లు తీసుకురావడంతో మార్కెట్‌ యార్డు మొత్తం నిండిపోయింది.

Published : 07 May 2024 03:24 IST

బాదేపల్లి మార్కెట్‌కు భారీగా పంట ఉత్పత్తుల రాకతో నిర్ణయం

న్యూస్‌టుడే, జడ్చర్ల గ్రామీణం : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి వారం రోజులుగా భారీగా ధాన్యం వస్తోంది. సోమవారం 700 మంది రైతులు వివిధ పంటలు 17,233 క్వింటాళ్లు తీసుకురావడంతో మార్కెట్‌ యార్డు మొత్తం నిండిపోయింది. ఉష్ణోగ్రత అధికంగా ఉండటంతో సరకు ఎత్తేందుకు హమాలీలు, కూలీలు రావటం లేదు. రాత్రి 9 గంటల వరకు ఎక్కడి బస్తాలు అక్కడే ఉన్నాయి. కాంటాలు వేసే వరకు అర్ధరాత్రి అవుతోందని వ్యాపారులు తెలిపారు. సరకు తరలించే పరిస్థితి లేకపోవడంతో మంగళవారం మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిపివేసేందుకు నిర్ణయించారు. బుధవారం అమావాస్య కావడంతో మార్కెట్‌లో కొనుగోళ్లు జరగవు. మార్కెట్‌లో రెండు రోజులు కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి గురువారం మార్కెట్‌లో కొనుగోళ్లు కొనసాగుతాయి. మార్కెట్‌కు ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం 13,375 క్వింటాళ్లు, మొక్కజొన్న 2,015 క్వింటాళ్లు రావటంతో ఏం చేయాలో వ్యాపారులు, అధికారులకు పాలుపోవటం లేదు. జిల్లా మార్కెటింగ్‌ అధికారిణి బాలమణికి కమిషనర్‌ ఏజెంట్లు, ఖరీదుదారులు పరిస్థితి వివరించడంతో ఆమె మార్కెట్‌ను సందర్శించి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. ఎక్కువ పంటలు రావడం, ప్రభుత్వ యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో ఉండటంతో వ్యాపారులు, రైతులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ఖరీదు చేసే ధాన్యం నిల్వ కోసం పత్తి మార్కెట్‌లో ఉన్న గిడ్డంగులను బాదేపల్లి ఇన్‌ఛార్జి కార్యదర్శి శ్రీనివాసులు, నవాబుపేట మార్కెట్‌ కార్యదర్శి రమేశ్‌తో కలిసి జిల్లా మార్కెటింగ్‌ అధికారి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు