logo

ష్‌... ఈసీ చూస్తోంది

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపిస్తుండటంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భాజపా అభ్యర్థుల తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Updated : 08 May 2024 06:44 IST

న్యూస్‌టుడే, అచ్చంపేట

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపిస్తుండటంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భాజపా అభ్యర్థుల తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల తరపున ఆ పార్టీ అధినేత రాహూల్‌ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, భారాస అభ్యర్థుల తరపున మాజీ సీఎం కేసీఆర్‌, పార్టీ అగ్ర నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రచారంలో పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలు, రోడ్డు షోలు నిర్వహిస్తూ ఓటర్ల నాడిని పట్టేందుకు యత్నిస్తున్నారు. ఎండలు మండుతున్నా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 31 మంది, నాగర్‌కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో 19 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన అభ్యర్థుల తరఫున భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. డబ్బు, మద్యం, కానుకలను పంపిణీ చేసేందుకు యత్నిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల నిఘా గురించి తెలుసుకుందాం.

వీడియో సర్వేలెన్స్‌ టీం (వీఎస్‌టీ)

లోక్‌సభ స్థానం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వీడియో సర్వేలెన్స్‌ బృందం (వీఎస్‌టీ) ఉంటుంది. ఈ బృందంలో ఒక రెవెన్యూ, ఒక పోలీసు అధికారి, ఒక వీడియో గ్రాఫర్‌ ఉంటారు. ఈ బృందం ప్రధానంగా సున్నితమైన అంశాలు, పెద్ద సభలు, సమావేశాలు, ర్యాలీలపై దృష్టి సారిస్తుంది. ప్రతి అంశాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో 14 బృందాలు పనిచేస్తున్నాయి.

వీడియో వ్యూయింగ్‌ టీం

క్షేత్ర స్థాయిలో వీడియో సర్వేలెన్స్‌ టీంల ద్వారా వచ్చిన వీడియోలను సునిశితంగా పరిశీలన చేసేందుకు వీడియో వ్యూయింగ్‌ బృందం (వీవీటీ) ఉంటుంది. ఈ బృందంలో ఒక గెజిటెడ్‌ అధికారితో పాటు ఇద్దరు సహాయకులు ఉంటారు. ఎంఎంసీ, వీఎస్‌టీ బృందాలు తీసుకొచ్చిన వీడియోలను పరిశీలన చేస్తారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఒక బృందం వంతున రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో 14 బృందాలు పనిచేస్తున్నాయి. కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించిన విషయాలను గుర్తించి వివరాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేస్తారు.  

మీడియా సమన్వయం, పర్యవేక్షణ

మీడియా కోఆర్డినేషన్‌ మానిటరింగ్‌ బృందం (ఎంసీఎంటీ) వార్తా పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్‌ ఆర్టికల్స్‌ కోసం అభ్యర్థులు చేసే ఖర్చును ఈ బృందాలు లెక్కిస్తాయి. వాటి ఖర్చులకు సంబంధించిన వివరాల నివేదికలను ఆర్వోకి అందజేస్తాయి.  


వ్యయ పరిమితి రూ.95 లక్షలు

లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరు  రూ. 95 లక్షలు వరకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది. అంత కన్నా ఎక్కువ ఖర్చు చేయరాదన్న నిబంధనలు ఉన్నాయి. అభ్యర్థులపై నిఘా పెట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యయ పరిశీలక బృందాన్ని ఏర్పాటు చేశారు. సహాయ వ్యయ పరిశీలకుడు (ఏఈవో)తో పాటు మరో ఇద్దరు అధికారులతో కూడిన ఈ బృందం వ్యయ పరిశీలనపై దృష్టి సారిస్తుంది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుతో పాటు రాజకీయ పార్టీలు చేసే ఖర్చును కూడా లెక్కిస్తారు.


ఎస్‌ఎస్‌టీ బృందాలు

లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో మూడు స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలు (ఎస్‌ఎస్‌టీ) ఏర్పాటు చేశారు. ఈ బృందానికి డిప్యూటీ తహసీల్దార్‌ స్థాయి అధికారిని బాధ్యుడిగా నియమించారు. ముగ్గురు పోలీసు అధికారులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఒకరు ఈ బృందంలో  ఆబ్కారీ అధికారి, ఒక వీడియో గ్రాఫర్‌ ఉంటారు. మొత్తం 8 మందితో ఉన్న ఈ బృందం ప్రతినిధులు డబ్బు, మద్యం, ఇతర వస్తు సామగ్రి తరలింపుపై దృష్టి సారిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 42 బృందాలు పని చేస్తున్నాయి. నియోజకవర్గ సరిధ్దులో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ప్రతిరోజు తనిఖీలపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నివేదికలు సమర్పిస్తాయి.


ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం (ఎఫ్‌ఎస్‌టీ)లను నియమించారు. ఒక్కో బృందంలో ఒక శాఖకు చెందిన అధికారి, ఇద్దరు పోలీసు సిబ్బంది, ఒక వీడియోగ్రాఫర్‌ ఉంటారు. రోజులో 24 గంటల పాటు షిప్టుల వారీగా పనిచేయాల్సి ఉంటుంది.జిల్లాలోని  14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 42 బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసే యత్నాలను నియంత్రించేందుకు బృందాలు పనిచేస్తాయి.


అకౌంటింగ్‌ టీం

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక అకౌంటింగ్‌ బృందం (ఏటీ) పనిచేస్తుంది. ఈ బృందంలో ఒక బ్యాంకు మేనేజర్‌ స్థాయి అధికారి, ఒక సహాయక అధికారి ఉంటారు. ప్రతిరోజు అభ్యర్థుల ఖర్చుల వివరాలను లెక్కిస్తారు. ఏ రోజుకారోజు చేసిన ఖర్చులు, వారు వినియోగించిన సామగ్రికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కిస్తారు. ప్రతి రోజు అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అప్పగిస్తారు. రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 14 బృందాలు పనిచేస్తున్నాయి.


ఎంసీసీ బృందాలు

ప్రతి నియోజకవర్గంలో ఒక్కో మండలానికి ఒక మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) బృందాన్ని నియమించారు. ఒక్కో బృందంలో నలుగురు అధికారులు ఉంటారు. ఈ బృందానికి బాధ్యుడిగా ఒక గెజిటెడ్‌ అధికారిని నియమిస్తారు. ఇద్దరు పోలీసు సిబ్బంది, మరో వీడయో గ్రాఫర్‌ ఉంటారు. వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచారం, ఎన్నికల ఖర్చుపై నిఘా పెడతారు. ఫొటోలు, వీడియోలు తీసి భద్రపరుస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు