logo

అతివేగం.. కుటుంబాలు చిన్నాభిన్నం

వాహనచోదకుల తొందరపాటు, మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు అతివేగంగా నడపటం వలన జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన వాటి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

Published : 09 May 2024 05:53 IST

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఆందోళన

బిజినేపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జుయిన వాహనం (పాత చిత్రం)

కందనూలు, న్యూస్‌టుడే : వాహనచోదకుల తొందరపాటు, మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు అతివేగంగా నడపటం వలన జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన వాటి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఎక్కువగా యువకులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అతివేగంగా వెళ్లే ద్విచక్ర వాహనాలు, వివిధ రకాల వాహనాలు అందుబాటులోకి రావడంతో యువకులు, వివిధ వర్గాలకు చెందిన వారు వాటిని ఖరీదు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. రోడ్డుపై వాహనాలు నడుపుతున్న సమయంలో వాటి వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లాలో ప్రమాదాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వాహనాలు నడపటంతో పాటు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు పేర్కొంటున్నారు.

చర్యలు నామమాత్రం.. : జిల్లాలో సరిహద్దు మండలమైన వెల్దండ నుంచి శ్రీశైలం వరకు జాతీయ రహదారి విస్తరించింది. కల్వకుర్తి నుంచి నల్గొండ జిల్లాలోని దేవరకొండ వరకు జాతీయ రహదారిని నిర్మించారు. ఈ రహదారులపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారిపై వేగ నిరోధకలు ఏర్పాటు చేయకపోవడం వలన వాహనచోదకులు అతివేగంతో వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. వెల్దండ మండలంలోని పెద్దాపూర్‌, చారకొండ మండలంలోని జూపల్లి, అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూర్‌, దోమలపెంట సమీపంలోని వట్టువర్లపల్లి వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బిజినేపల్లి మండలంలోని మంగనూర్‌, పాలెం సమీపంలోని వెంకటాపూర్‌, నాగర్‌కర్నూల్‌ మండలంలోని చందుబట్ల, మంతటి గేట్‌ల వద్ద, తెల్కపల్లి మండల పరిధిలోని జమిస్తాపూర్‌ గేట్‌ వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ప్రమాదాల జరుగుతున్న ప్రాంతాలను అధికారులు గుర్తించి నామమాత్రంగా చర్యలు చేపడుతున్నారు తప్పా పూర్తి స్థాయిలో అరికట్టడానికి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు నెలల్లో 136 ప్రమాదాలు : జిల్లాలో నాలుగు నెలల్లో 136 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కల్గిస్తున్నది. ఈ ప్రమాదాల్లో 68 మంది వ్యక్తులు మరణించగా, 168 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసుశాఖ అధికారులు ప్రకటించిన గణాంకలు చెప్పుతున్నాయి. నాలుగు నెలల నుంచి జిల్లాలోని బిజినేపల్లి మండలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

అవగాహన కల్పిస్తున్నాం..

జాతీయ రహదారులపై అతివేగంతో వాహనాలు నడపవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.మరమ్మతులు ఉన్న ప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందిస్తున్నాం. నిత్యం తనిఖీలు చేపట్టి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నాం. వాహనచోదకులు రహదారులపై అతివేగంతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను అరికట్టడానికి సహకరించాలి.

గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఎస్పీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు