logo

అడుగంటిన జలం.. సమస్య తీవ్రం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. చాలా ప్రాంతాల్లోని జల వనరులైన చెరువులు, వాగుల్లో చుక్క నీరు లేక భూమి నెర్రెలు బారింది.

Published : 09 May 2024 06:12 IST

మహబూబ్‌నగర్‌ పట్టణం సమీపంలోని మయూరి పార్కు ముందు ఎండిపోయిన చిన్నచెరువు

న్యూస్‌టుడే, పాలమూరు, రాజాపూర్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. చాలా ప్రాంతాల్లోని జల వనరులైన చెరువులు, వాగుల్లో చుక్క నీరు లేక భూమి నెర్రెలు బారింది. రెండు నెలల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీల కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా మండలాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. రెండు రోజుల నుంచి అక్కడక్కడ అరకొరగా వర్షాలు కురిసినా అంతగా ప్రభావితం చేసేవి కావు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లో నీటి కొరత ఏర్పడింది. వీటి పరిధిలో 50 శాతానికి పైగా బోరుబావులు ఎండిపోయాయని అంచనా. మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో లక్షన్నరకు పైగానే బోరుబావులు ఉండగా వీటిలో 40 శాతం వరకు ఎండిపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 45వేల బోర్లు, నారాయణపేట జిల్లాలో 25వేల బోర్లు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో బోర్లు బాగానే ఉన్నాయి.

సమస్య తీవ్రత ఇక్కడే : మహబూబ్‌నగర్‌ జిల్లాలో మార్చి నెలలో భూగర్భ జలాలు 11.43 మీటర్ల లోతులో ఉండగా ఏప్రిల్‌ నెలలో 13.33 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఒక్క నెలలో ఆరు అడుగుల లోతులోకి భూగర్భ జలాలు వెళ్లాయి. 25 మీటర్ల కంటే ఎక్కువ లోతులోకి భూగర్భ జలాలలు వెళ్లిన మండలాలు ఏడు ఉన్నాయి. మరో 11 మండలాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. వాటిలో గుండుమాల్‌, ధన్వాడ, వెల్దండ, ఉప్పునుంతల, కల్వకుర్తి, నందిన్నె, మానవపాడు, మదనాపురం, కొత్తకోట, నవాబుపేట, మిడ్జిల్‌ మండలాలు ఉన్నాయి. 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉంటే ఆ ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది.

ఇది మహబూబ్‌నగర్‌ పురపాలిక బోయపల్లిలో కోట్లవీధిలోని బోరుబావి. బోయపల్లిలోని 200 కుటుంబాలకు తాగునీరు అందించే ఈ బోరుబావిలో భూగర్భ జలమట్టం మూడు నెలల నుంచి పడిపోతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. దీని బోరు మోటారును పురపాలిక వారు తీసుకెళ్లగా బోయపల్లిలో తాగునీటి సమస్య నెలకొంది.
రాజాపూర్‌ మండలం దొండ్లపల్లిలో రైతు వన్నె రాజుకు 14 ఎకరాల పొలం ఉంది. 9 ఎకరాల్లో ఆయిల్‌పాం టోట, మరో ఎకరంలో వరి పంట సాగు చేశారు.  పొలంలో 500 అడుగులకు పైగా లోతు వరకు ఐదు బోరుబావులను తవ్వించగా మూడింటిలో నీరు పడలేదు. రెండింట్లో అరకొర నీరు పడగా అందులోనూ ఒకటి ఎండిపోయింది. మిగిలిన ఒక్కబోరు బావిలోనూ నీరు చాలా తక్కువ వస్తుండటంతో ఆయిల్‌పాం చెట్లు ఎండిపోకుండా కాపాడుకునేందుకు భారీగా ఖర్చు చేసి ట్యాంకర్‌తో నీటిని అందించాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు