logo

పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ?

పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాలేదు. అన్ని యాజమాన్యాల పరిధిలో జిల్లాలో 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 11,338 మంది (89.47 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Published : 09 May 2024 06:20 IST

మహబూబ్‌నగర్‌లో పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులు (పాతచిత్రం)

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే : పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాలేదు. అన్ని యాజమాన్యాల పరిధిలో జిల్లాలో 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 11,338 మంది (89.47 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వివిధ సబ్జెక్టుల్లో అనుత్తీర్ణులైన వారంతా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యేలా విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. జూన్‌ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అంటే ఇంకా 24 రోజులే గడువు ఉంది. ఇందుకు కృషిచేయాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులంతా సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిమగ్నం కావటం ఆందోళన కలిగిస్తోంది.

ఉపాధ్యాయుల చొరమే కీలకం : పదో తరగతి ఫలితాల్లో వివిధ సబ్జెక్టుల్లో 2,127 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. ముఖ్యంగా భాష(1, 2, 3)ల్లో కలిపి మొత్తం 790 మంది అనుత్తీర్ణులయ్యారు. మరోవైపు గణితంలోనూ వెనకబడ్డారు. సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రంలోనూ పరీక్ష తప్పారు. ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిన వారికి పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు బోధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో అర్హత మార్కులు సాధించేలా సన్నద్ధం చేయించాలి. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. పదో తరగతి ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో మూడంకెల సంఖ్యలో అనుత్తీర్ణులైన విషయం తాజాగా వెలుగు చూసింది. విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం, యంత్రాంగం పర్యవేక్షణ కొరవడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

మెరుగైన ఫలితాలకు కృషి : వార్షిక ఫలితాల్లో ఫెయిలైన వారిలో ఏ ఒక్క విద్యార్థికి కూడా విద్యా సంవత్సరం వృథా కావొద్దు.. వారంతా ఉత్తీర్ణులయ్యేలా కృషిచేస్తాం. విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి సన్నద్ధం చేయించాలని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, ఎంఈవోలు, కేజీబీవీల సీవోలకు ఆదేశాలిచ్చాం. బోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించాం.

రవీందర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని