logo

పోలింగ్‌ శాతం పెంపే లక్ష్యం

లోక్‌సభ ఎన్నికల నిర్వహణ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కొన్ని గ్రామాలు తలనొప్పిగా మారాయి.

Published : 10 May 2024 03:51 IST

బల్మూర్‌లో దారిపై భైఠాయించి భూ నిర్వాసితుల నిరసన (పాతచిత్రం)
బల్మూర్‌ (అచ్చంపేట న్యూటౌన్‌), న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల నిర్వహణ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కొన్ని గ్రామాలు తలనొప్పిగా మారాయి. బల్మూర్‌ మండలంలోని మైలారంలో 783 మంది ఓటర్లుండగా, బల్మూర్‌లో 3,490 మంది ఓటర్లున్నారు. మైలారం గుట్టపై పలుగురాళ్లు తవ్వేందుకు వెంటనే అనుమతులను నిలిపేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామంలో పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శ్రీ ఉమామహేశ్వర జలాశయం నిర్మాణ పనులను రద్దు చేయాలని కోరుతూ బాధితులు జలాశయం వ్యతిరేక సమితిగా ఏర్పడ్డారు. బల్మూర్‌ గ్రామంలోని భూ నిర్వాసితులు పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి విడతల వారీగా నిరసనలు, ఆందోళనలు, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 30న మైలారం గ్రామానికి చేరుకున్న అదనపు ఎన్నికల అధికారి, ఆర్డీవో మాధవి గ్రామస్థులతో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అచ్చంపేట మండలం బక్కలింగయ్యపల్లిలో వ్యవసాయ భూములకు పట్టాల సమస్య కోసం పోలింగ్‌ బహిష్కరణ తెరపైకి వచ్చినప్పటికీ అధికారులు గ్రామస్థులను శాంతింపజేశారు. దీనితోపాటు పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల ఏర్పాటు, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులు, పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాతో పాటు పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 339 కేంద్రాల పరిధిలో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు.

ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలి..: అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు ప్రజాస్వామ్య ఆయుధం.. ఇప్పటికే మైలారంలో ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించాం. బల్మూర్‌లోని జలాశయం భూ నిర్వాసితులను కలిసి పోలింగ్‌లో పాల్గొనేలా చర్యలు చేపడతాం. ఈ నెల 13న జరుగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పాల్గొని సహకరించాలి.

 - మాధవి, అదనపు ఎన్నికల అధికారి అచ్చంపేట 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు