logo

ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నా

ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు.

Updated : 10 May 2024 06:29 IST

పెబ్బేరు, న్యూస్‌టుడే : ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కొత్తకోట మండలం నాటవెల్లి పెద్ద తండాకు చెందిన జుమ్యా, మోత్యా నాయక్‌లకు చెందిన పెద్ద కుమారుడు రాజు (17) ఊపిరితిత్తుల సమస్య కారణంగా మంగళవారం పెబ్బేరులోని సరోజిని ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వివిధ పరీక్షల కోసం వనపర్తికి ల్యాబ్‌కు పంపించారు. అక్కడ పరీక్షలు చేయించుకుని ఫలితాలతో బుధవారం ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు హైదరాబాద్‌కు వెళ్లమని సూచించారు. ఆసుపత్రికి చెందిన అంబులెన్స్‌లో బాధితులు రోగితో బయలుదేరారు. ఆక్సిజన్‌ లేకపోవడంతో మార్గమధ్యంలోనే రాజు మృతి చెందారని వారు తెలిపారు. గురువారం తెల్లవారుజామున మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఆసుపత్రి ఫీజు రూ.4 వేలు ఇవ్వాల్సి ఉంటే వాటి కోసం పెబ్బేరుకు రప్పించుకుని రెండు గంటలకు పైగా ఆలస్యం చేశారని ఆరోపించారు. రాజు ఇటీవల ఇంటర్మీడియట్‌ సీఈసీలో 805 మార్కులు సాధించారని కుటుంబ సభ్యులు తెలిపారు.

  • నాటవెల్లి పెద్దలు ఆసుపత్రి యజమాన్యంతో మాట్లాడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. రూ.3 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఆసుపత్రి యజమాని డాక్టర్‌ భరత్‌కుమార్‌ మాట్లాడుతూ  రోగి అడ్మిట్‌ కాలేదని, పరీక్షించి టెస్టులకు వనపర్తికి పంపించామన్నారు.ఫలితాలు వచ్చిన తర్వాత హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించామన్నారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ ఉందని పేర్కొన్నారు. మానవతాదృక్పథంతో రూ.3 లక్షలు పెద్దమనుషులు ఇప్పించారన్నారు.

 భర్త, మరిది వేధింపులతో నవ వధువు ఆత్మహత్య

 హైదరాబాద్‌ : భర్త, మరిది వేధింపులతో పెళ్లి అయిన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన తిరుపతయ్య కుమార్తె గాయత్రి (19) వివాహం, వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన రాజన్నగౌడ్‌ కుమారుడు బాలకృష్ణతో మార్చి 13న జరిగింది. అదే నెల 29న నూతన దంపతులు జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి కర్మన్‌ఘాట్‌ పరిధి రాంనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. వారితో పాటు బాలకృష్ణ సోదరుడు శ్రీకాంత్‌ ఉంటున్నాడు. భర్త, మరిది వేధిస్తుండటంతో ఇటీవల పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు సర్దిజెప్పి, మూడు రోజుల క్రితం తీసుకొచ్చారు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.


కార్మికురాలిపై లైంగిక దాడి.. తుక్కు వ్యాపారిపై కేసు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ఓ వలస కార్మికురాలిని నమ్మించి లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దంపతులు ఉపాధి కోసం 5 నెలల క్రితం శంషాబాద్‌కు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్‌లోని అహ్మద్‌నగర్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఖలీల్‌తో వీరికి పరిచయం ఏర్పడింది. గత నెల 25న సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆ మహిళను ఇంటి వద్ద వదిలేస్తానంటూ ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లాడు. అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమెను తీవ్రస్థాయిలో బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఖలీల్‌ నిద్రిస్తుండగా ఆమె వేకువజామున తప్పించుకుని ఇంటికి వెళ్లి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన ఆమె భర్త వెంటనే ఆసుపత్రికి తరలించాడు. కోలుకున్నాక ఆమె జరిగిన విషయం భర్తకు చెప్పడంతో వారు గురువారం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తుక్కు వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని