logo

పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్‌!

బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది.

Published : 10 May 2024 04:16 IST

ఇప్పటి వరకు జిల్లాకు చేరినవి ఆరో వంతు

 జిల్లా కేంద్రంలోని గోదాంలో పాఠ్యపుస్తకాలు

న్యూస్‌టుడే, గద్వాల న్యూటౌన్‌: బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని నెలల కిందటే ముద్రణ ప్రారంభించగా, ప్రస్తుతం ఆయా జిల్లాలకు పుస్తకాలు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం మొదటి రోజే పిల్లలకు పుస్తకాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన వాటిని జిల్లా కేంద్రంలోని గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. విడతల వారీగా మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో పుస్తకాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

 5.52 లక్షలు అవసరం: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, కస్తూర్బా, గురుకుల పాఠశాలలు కలిపి మొత్తం 488 ఉన్నాయి. ఇందులో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు యూడైస్‌ ప్రకారం మొత్తం 72,500 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి 5 నుంచి 11 పాఠ్య పుస్తకాలు అవసరం. ఆంగ్లం, తెలుగు మాధ్యమంలో పుస్తక ముద్రణ ఉండటంతో రెండు విభాగాలుగా సరఫరా చేస్తున్నారు. ఇలా మొత్తం జిల్లాకు 6.09 లక్షల పుస్తకాలు అవసరమని జిల్లా అధికారులు ఇండెంట్‌ పెట్టారు. దీని ఆధారంగా మొదటి విడతగా (ఎస్‌ఏ-1 పరీక్షల పాఠ్యాంశం ఉన్నవి) జిల్లాకు 5.52 లక్షల పుస్తకాలు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1.10 లక్షల పుస్తకాలు వచ్చాయి. ఉర్దూ, ఆంగ్లం, తెలుగు, సంస్కృతం మాధ్యమాలకు సంబంధించి మొత్తం 187 టైటిల్స్‌ అవసరం ఉండగా, ప్రస్తుతం వచ్చిన పుస్తకాల్లో 9 టైటిల్స్‌ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

 ద్విభాష మాధ్యమంలో..: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే పుస్తకాల్లో ఓ వైపు తెలుగు మరోవైపు ఆంగ్లంలో ముద్రణ ఉంటుంది. తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్లంలో సులువుగా అర్థమవుతుందన్న ఉద్దేశంలో ఇలా ముద్రిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇదే విధానంలో ముద్రించారు. ఈ సారి 10వ తరగతి వరకు ఇది అమలవుతోంది. వీటికి క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంటుంది. ఉన్నత పాఠశాల విద్యార్థులు స్కాన్‌ చేసి దీక్ష యాప్‌లో పాఠాలు వీడియోల రూపంలో చూసేందుకు, వినేందుకు వీలుగా ఈ క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగపడనుంది. ఈ సారి పుస్తకాల వరుస సంఖ్యతో ముంద్రించారు. దీనివల్ల బయటి మార్కెట్లో విక్రయించకుండా చర్యలు తీసుకోవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.
సిద్ధంగా ఉంచుతాం: పాఠశాలలు తెరిచే నాటికి పుస్తకాలు విద్యార్థులకు అందించేందుకు సిద్ధంగా ఉంచుతాం. ఈ మేరకు ముందస్తుగానే జిల్లాకు పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచాం. వీలైనంత త్వరగానే లక్ష్యం మేర పుస్తకాలు రానున్నాయి
-అమరేశ్‌బాబు, పాఠ్యపుస్తక విభాగం జిల్లా మేనేజర్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని