logo

తరాలు చూసినా తరగని స్ఫూర్తి

దేశ భవితకు చుక్కాని అని చెప్పే యువతలో చాలామందికి ఓట్లేయడం అంటే బద్ధకం... రాజకీయాలను విశ్లేషించే మధ్య వయస్కులు, విద్యావంతుల్లో కొందరు పోలింగ్‌కు వెళ్లడానికి పూట కేటాయించడానికి ఆలోచిస్తారు.

Updated : 10 May 2024 04:31 IST

దేశ భవితకు చుక్కాని అని చెప్పే యువతలో చాలామందికి ఓట్లేయడం అంటే బద్ధకం... రాజకీయాలను విశ్లేషించే మధ్య వయస్కులు, విద్యావంతుల్లో కొందరు పోలింగ్‌కు వెళ్లడానికి పూట కేటాయించడానికి ఆలోచిస్తారు... అలాంటిది శరీరం సహకరించకపోయినా ఓటేస్తేనే మనిషి బతికున్నట్లుగా వృద్ధులు భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటేసే వారి ఆలోచన ధోరణి అందరికీ స్ఫూర్తిదాయకం.

న్యూస్‌టుడే, అచ్చంపేట, మక్తల్‌ పట్టణం: ప్రతిసారి ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం స్వీప్‌ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓటు నమోదు కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామాల్లో ఓటర్లు కొంత వరకు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తక్కువ ఉంటోంది. అక్షరాస్యులే అధికంగా ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం అధికంగా నమోదు అవుతుండగా లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మంది ఓటు వేస్తున్నారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 హోం ఓటింగ్‌కు 524 మంది వృద్ధులు

 లోక్‌సభ ఎన్నికల్లో 85 ఏళ్ల పైబడిన వృద్ధులు ఉమ్మడి జిల్లాలో హోం ఓటింగ్‌ కోసం 524 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల సంఘం కల్పించిన అవకాశం పట్ల అవగాహన ఉన్న వారు మాత్రమే హోం ఓటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో పాటు హోం ఓటింగ్‌ కార్యక్రమాన్ని అధికారులు కొనసాగిస్తున్నారు. హోం ఓటింగ్‌ కోసం కేవలం 20 శాతం మంది వృద్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 10 వరకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. వయసు పైబడినా హోం ఓటింగ్‌ పట్ల అవగాహన లేని వృద్ధులు వందల సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్‌ రోజు సుమారు 4800 మందికి పైగా వృద్ధులు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వృద్ధుల కోసం రవాణా సౌకర్యంతో పాటు పోలింగ్‌ కేంద్రాల లోపలికి వెళ్లేందుకు మూడు చక్రాల కుర్చీలను అందుబాటులో ఉంటుతున్నారు.

ఎంతో పవిత్రంగా భావించాం

తెలంగాణ సాయుధ పోరాటం నల్గొండ ప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఆ జిల్లాకు సరిహద్దున మా గ్రామం ఉండటంతో ఉద్యమంతో అనుబంధం ఉంది. నిజాం పాలనలో రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమకారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్య పరచేవారు. దాడులు జరిగినప్పుడు ఉద్యమకారులు తలదాచుకోవడానికి ఆశ్రయం కల్పించాం. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన తరువాత నిర్వహించిన తొలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నా. అప్పట్లో ఓటును ఎంతో పవిత్రంగా చూసే వాళ్లం. ప్రస్తుతం 106 ఏళ్ల వయసు ఉన్నా ఓటు వేయడం ఏనాడు మరచిపోలేదు. ప్రతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళుతున్నా. రాజకీయాల గురించి ఓ రకమైన తప్పుడు భావన ఏర్పరచుకుని ఓటుకు దూరంగా ఉండటం సరికాదు. పోటీలో ఉన్నవారిలో మంచివారిని ఎన్నుకుందాం..
- కుప్పిరెడ్డి రామచంద్రమ్మ, చెన్నారం (అచ్చంపేట)


ఎవరికివారు వదిలేస్తే...

నేను ఓటేయకపోతే ఏమవుతుందని ఎవరికివారు అనుకుంటే లెక్కల్లో తేడా వస్తుంది. చిన్నతేడాతోనైనా అనర్హులు అందలం ఎక్కే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి సందర్భాలనూ చూశాం. అందుకే 103 ఏళ్ల వయసు వచ్చినా ఏ రోజూ ఓటు మానలేదు. బాధ్యతాయుతమైన వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని నేను నమ్ముతున్నాను.మే 13న జరిగే ఎన్నికల్లోనూ అంతే ఉత్సాహంతో ఓటు వేస్తున్నట్లు తెలిపారు. ఓటు వేయడం అనేది ఒక పవిత్ర కార్యం.
- గవినోళ్ల చెన్నమ్మ, భూత్పూర్‌


ఓటు మన జన్మహక్కు

ఓటును జన్మహక్కుగా భావిస్తాను. ఇప్పటి తరం వాళ్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. చదువుకున్న వాళ్లు అధికంగా ఉండే పట్టణాల్లో చాలా తక్కువ మంది ఓటు వేస్తున్నట్లు టీవీ వార్తల్లో విన్నప్పుడు ఎంతో బాధ వేస్తుంది. ఓటు వేసే రోజును సెలవుగా భావిస్తూ కాలక్షేపం చేయడం బాధాకరం. నాకు ప్రాణం ఉన్నంత వరకు ఓటు వేయడం మానుకోను. మా కుటుంబంలో మొత్తం నాలుగు తరాలకు చెందిన వంద మందికి పైగా ఉంటారు. అర్హులైన వారందరు ఓటు వేసేలా శ్రద్ధ తీసుకుంటాను. అందరితో ఓటు వేయించేందుకు వారం ముందు నుంచే వారికి చెపుతుంటా.
- మంగలి కిష్టమ్మ(94), యాదవననగర్‌(మక్తల్‌)
- గట్టు రామచంద్రమ్మ(98), బాణాల (బల్మూరు)


వేయకుంటే చనిపోయినట్లే

ఇప్పుడు నా వయసు 102 ఏళ్లు. తొలిసారి నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేశాను. ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రాధాన్యం ఇస్తాను. ఓటు వేయకపోతే చనిపోయిన వాళ్లతో సమానమని భావిస్తాం. ఎంత ఇబ్బంది ఉన్నా ఓటు రోజు పనులు మానుకొని వెళ్లే వాళ్లం. గత నవంబరు 30న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మా గ్రామంలో ఓటు వేశాను. కుటుంబ సభ్యుల సాయంతో వెళ్లి తప్పకుండా ఓటు వేయడం అలవాటు చేసుకున్నా. ఈ నెల 13న నిర్వహించే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓటు వేస్తాను. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నా.
- చెరుకుపల్లి మల్లమ్మ, వంకేశ్వరం (పదర)


అమ్ముకోవడం దురదృష్టకరం

నా వయసు ఇప్పుడు 96 ఏళ్లు. హక్కు వచ్చిన నుంచి ఓటు వేస్తునే ఉన్నా. అప్పట్లో పోలింగ్‌ను ఎంతో పవిత్రంగా భావించే వాళ్లం. పోటీలో ఉన్న నాయకుల ఖర్చులకు మేము చందాలు వసూలు చేసి ఇచ్చే వాళ్లం. ఈ రోజుల్లో ఎన్నికల విధానం బాధ కలిగిస్తోంది. ఓటును అమ్ముకునే దుస్థితి రావడం దురదృష్టకరం. సారా, మద్యం డబ్బు విచ్చలవిడిగా పంచుతూ ఎన్నికల విధానాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు. ఓటు కొనడం, అమ్మడం సరైంది కాదు. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి రాజ్యాంగం కల్పించిన ఓటును ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి.
- దరగోని మల్లమ్మ, తిర్మలాపూరు (అమ్రాబాద్‌)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని