భగవన్నామ స్మరణతోనే మానసిక ప్రశాంతత
మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్‌లో లక్ష దీపోత్సవం
గజ్వేల్ గ్రామీణ, న్యూస్‌టుడే: భగవన్నామ స్మరణతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి గజ్వేల్ పట్టణంలో లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీపరమేశ్వరుల కల్యాణం, లక్షదీపోత్సవం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శివలింగానికి అభిషేకం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ క్షణం తీరిక లేకుండా జీవనం సాగిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ చేసినన్ని యాగాలు ఇంకెవరు చేయలేదన్నారు. వచ్చే ఏడాదిలో యాదాద్రి ఆలయం ప్రారంభం కానుందని చెప్పారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. అంతకుముందు నిర్వహించిన పార్వతీపరమేశ్వరుల కల్యాణం, లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. పరమహంస సద్గురువులు సచ్చిదానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కల్యాణోత్సవం జరిగింది. స్థానికులు, పరిసర గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. రాత్రి వేళ భక్తులు దీపాలను వెలిగించారు. పురాణం మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమం కొనసాగింది. పండితులు మహానీరాజనం సమర్పించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజమౌళి, వైస్ ఛైర్మన్ జకియోద్దీన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.