logo
Published : 29 Nov 2021 01:31 IST

అవకతవకల కేసు అటకెక్కినట్లేనా..?!

ధాన్యం కొనుగోళ్లలో స్వాహా చేసిన మొత్తం వసూలులో నిర్లక్ష్యం
న్యూస్‌టుడే, చేర్యాల

విచారణ సందర్భంగా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న కడవేర్గు రైతులు

రూ.వేలు కాదు, లక్షలు కాదు.. అక్రమార్కులు ఏకంగా రూ.4 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టినా అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పేరున్న నాయకులు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే ఇలా ఉంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. మూడు నెలల క్రితం జరిగిన విచారణలో రూ.4 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు నిఘా విభాగం అధికారులు గుర్తించగా నేటికీ ఎలాంటి చర్యలు లేవు. నిరుడు యాసంగి అనంతరం చేర్యాల పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆ సంఘం డైరెక్టర్లు మేర్గు క్రిష్ణ, కొమ్ము రవి తదితరులు చేసిన ఫిర్యాదుతో తీగ లాగితే డొంక కదిలింది. పౌర సరఫరాల నిఘా విభాగం రాష్ట్ర అధికారుల బృందం ప్రత్యేకంగా వారం రోజుల పాటు కొనుగోలు కేంద్రాల దస్త్రాలు, ధాన్యం మిల్లులు రికార్డులు, నిల్వలు ప్రత్యక్షంగా పరిశీలించారు. తొలుత చేర్యాల పీఏసీఎస్‌ పరిధిలోని మూడు కేంద్రాల్లోనే అనుకున్నా ఆ తర్వాత ఐకేపీ ఆధ్వర్యంలోని కేంద్రాలు, సమీప మండలాలైన కొమురవెల్లి, ధూల్మిట్టల్లోనూ అక్రమాలు వెలుగు చూశాయి. చేర్యాల పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో చేర్యాల, కడవేర్గు, పోసాన్‌పల్లి (కేవలం మూడు గ్రామాల్లోనే) కొనుగోలు కేంద్రాల్లోనే 52 తప్పుడు ట్రక్‌ షీట్లతో 92 మంది రైతుల పేరిట 38,398 బస్తాల ధాన్యం మిల్లులో దించుకున్నట్లు తప్పుడు లెక్కలు ప్రభుత్వానికి చూపి రూ.2.63 కోట్లు, ఐకేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని చుంచనకోట, మర్రిముచ్చాల, వేచరేణి) మరో మూడు గ్రామాల్లో 26 ట్రక్‌షీట్ల ద్వారా ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయకుండానే రూ.1.43 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి దోచుకున్నట్లు నిఘా అధికారులు తేల్చారు. వాటితో పాటు ధూల్మిట్ట మండలం భైరాన్‌పల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఆరు ట్రక్‌షీట్లతో 1,680 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయకుండానే మిల్లులో దించుకున్నట్లు ప్రభుత్వానికి పంపి రూ.31,71,840లు స్వాహా చేసినట్ల్లు అధికారులు నిర్ధారించిన విషయం విదితమే.

52 మందిపై కేసు.. 15 మంది అరెస్టు...
జిల్లాలో సంచలనం కలిగించిన ధాన్యం కొనుగోళ్ల అవకతవకలపై విచారణ చేపట్టిన నిఘా విభాగం అధికారుల సిఫారసు మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు నాలుగు దఫాలుగా చేర్యాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం 52 మందిపై కేసు నమోదు అయింది. ఆ తర్వాత పోలీసులు మూడు పర్యాయాలు 15 మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. మిగిలిన వారంతా పరారీలో ఉండి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. రిమాండుకు వెళ్లినవారు పక్షం రోజులకు బెయిల్‌పై బయటకు వచ్చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసి రూ.4 కోట్లకు పైగా ప్రజాధనాన్ని కాజేసిన వారిలో ఏ ఒక్కరిలో ప్రాయశ్చిత్తం కనిపించడం లేదు.

అన్నింటా జాప్యమే..
మూడు మండలాల్లో కేవలం 7 గ్రామాల్లో చేసిన తనిఖీల్లోనే రూ.4 కోట్లకు పైగా అక్రమాలు వెలుగు చూశాయి. మిగిలిన అన్ని గ్రామాల్లోనూ విచారణ చేస్తే రూ.10 కోట్లకు పైగా అక్రమాలు బయటపడేవని స్థానికంగా చర్చించుకుంటున్నారు. గింజ ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టిన రూ.4 కోట్లు చేర్యాల మండలం ముస్త్యాల, వీరన్నపేట శివార్లలో నాలుగు మిల్లులకు చెందిన భాగస్వాములు, వారి బంధువులు, మిత్రులు, అనుచరుల పేరిట మొత్తం 84 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. పోలీసులు కేసులు నమోదు చేసిన తర్వాత వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసినా అప్పటికే ఆ మొత్తాలను ఖాతాల్లోనుంచి తీసుకోవడం గమనార్హం. దీంతో ఖాతాలను స్తంభింపజేసినా ప్రయోజనం సున్నా. రూ.2 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నా ఆ మొత్తం ఎవరి నుంచి చేశారు. ఎక్కడ డిపాజిట్‌ చేశారో చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


రూ.2 కోట్లు తిరిగి రాబట్టాం..
హరీశ్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, సిద్దిపేట

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాల కేసు విచారణ నడుస్తోంది. రూ.4 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఇప్పటి వరకు రూ.2 కోట్లు రికవరీ చేశాం. త్వరలో పూర్తిగా వసూలు చేస్తాం. అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినీ వదిలి పెట్టం.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని