logo

సర్కారు దవాఖానా.. చికిత్సల ఖజానా

ప్రసూతి సమయంలో ఇబ్బందులెదురైనా, రోడ్డు ప్రమాదాలు జరిగినా, దీర్ఘకాలిక, సాంక్రమిక వ్యాధులు వచ్చినా ఒకప్పుడు చలో హైదరాబాద్‌ అని జిల్లాల నుంచి రోగులను వైద్యులు పంపించేవారు. ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఒకటుంది.. అనే

Published : 27 Jan 2022 01:43 IST

‘నేను రాను బిడ్డో..’ నుంచి ‘ఇదిగో వచ్చేస్తున్నా..’ వరకు..
జిల్లాల్లోనే అందుతున్న  మెరుగైన వైద్య సేవలు

సిద్దిపేటలోని ఎన్‌ఐసీయూ వార్డు..

ప్రసూతి సమయంలో ఇబ్బందులెదురైనా, రోడ్డు ప్రమాదాలు జరిగినా, దీర్ఘకాలిక, సాంక్రమిక వ్యాధులు వచ్చినా ఒకప్పుడు చలో హైదరాబాద్‌ అని జిల్లాల నుంచి రోగులను వైద్యులు పంపించేవారు. ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఒకటుంది.. అనే విషయం మరిచిపోయి ప్రైవేటులో చికిత్స చేయించుకునేవారు. నేడు ఆ పరిస్థితి మెల్లగా మారుతోంది. చికిత్స విధానాల్లో ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా నిపుణులైన వైద్యులు, ఆధునిక పరికరాల సాయంతో సౌకర్యంగా చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచుతున్నారు. ఉమ్మడి మెదక్‌ నుంచి ప్రస్తుతం ప్రతిదానికీ హైదరాబాద్‌కు రోగులను పంపించే పని లేకుండా జిల్లా కేంద్రాల్లోని సర్వజన ఆసుపత్రుల్లోనే చక్కటి చికిత్స అందిస్తున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి.. ప్రజల వైద్య సౌకర్యానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో వివరించే ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌: ఇటీవల కరీంనగర్‌కు చెందిన ఓ గర్భిణికి అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో ఎనిమిది నెలల్లోనే ప్రసవం జరిగింది. తక్కువ బరువుతో (1.2 కిలోల) శిశువు జన్మించగా అక్కడే రెండు రోజుల పాటు చికిత్స పొందారు. ఊపిరి తీసుకోవడంలో సమస్య ఎదురవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ లేదా వరంగల్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో సిద్దిపేటకు చెందిన శిశువు బంధువు స్థానిక జీజీహెచ్‌లోని చిన్నపిల్లల విభాగంలోని ఎన్‌ఐసీయూలో చేర్చారు. తొలి ఐదు రోజులు వెంటిలేషన్‌పై చికిత్స అందించారు. మొత్తం 15 రోజుల పాటు ఎన్‌ఐసీయూలో, తరువాత కేఎంసీ వార్డులో పరిశీలనలో పెట్టారు. అలా 45 రోజులకు శిశువు సాధారణ స్థితికి చేరింది. 1.5 కేజీల బరువుతో రెండు వారాల కిందట సురక్షితంగా పంపించేశారు. ఒకప్పుడు చిన్నారులకు అంతుచిక్కని, తీవ్రమైన ఎలాంటి సమస్య ఎదురైనా తల్లిదండ్రులు హైదరాబాద్‌ ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఇది భారంగా మారేది. సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య

కళాశాల అనుబంధ సర్వ
జన ఆసుపత్రి (జీజీహెచ్‌) సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత ముఖచిత్రం మారింది. ఇక్కడి చిన్నపిల్లల వైద్య విభాగం ప్రత్యేకతను చాటుతోంది. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి సిద్దిపేటకు వస్తుండటం విశేషం. ఏటా సుమారు 1200 మందికి పైగా శిశువులకు చిన్నపిల్లల విభాగం ద్వారా సేవలు అందిస్తున్నారు. ఆధునిక సదుపాయాలతో విభాగాన్ని కొనసాగిస్తున్నారు. జీజీహెచ్‌లో ప్రతి నెలా దాదాపు 500 ప్రసవాలు చేస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో పలు సమస్యలతో ఎస్‌ఎన్‌సీయూలో 7500 మంది చేరారు. ఇప్పటి వరకు తొమ్మిది నెలలు నిండకుండానే జన్మించిన 1500 మందికి ఆధునిక సేవలు అందిస్తున్నారు. ప్రతి బుధవారం ఆసుపత్రిలోని రెటినోపతి ఆఫ్‌ ప్రిమెచ్యురిటీ లోపాలను గుర్తిస్తున్నారు. ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల సౌజన్యంతో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. మొత్తం 20 మందిని కంటి సంబంధిత లోపాలున్నట్లు గుర్తించి లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేశారు. ప్రతి గురువారం వినికిడి, శుక్రవారం అవయవ ఎదుగుదల లోపాలు (న్యూరో డెవలప్‌మెంట్‌) గుర్తించేందుకు స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. శిశువు జన్మించిన వెంటనే సమస్యలు గుర్తించి వైద్యులను సంప్రదించాలని, తద్వారా పరిష్కారం సులువుగా మారుతుందని చిన్నపిల్లల వైద్య విభాగం అధిపతి  డా. సురేశ్‌బాబు, సూపరింటెండెంట్‌ డా. కిషోర్‌కుమార్‌ చెబుతున్నారు. ఒకప్పుడు లేజర్‌ ట్రీట్‌మెంటుకు హైదరాబాద్‌ వెళ్లే వారు. చిన్నారులు శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదురైతే సీ-పాప్‌ (కంటిన్యూయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెజర్‌), నెలలు నిండకుండా పుట్టిన శిశువుకు చికిత్స అందిస్తున్నారు. నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఆరుగురు పిల్లల వైద్యులు, 26 మంది నర్సులు విడతల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. సిద్దిపేట పరిధిలో ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని... ఆధునిక సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్యులు, సిబ్బంది చిన్న పిల్లల విభాగంలో అందుబాటులో ఉన్నారని.. ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్‌ తమిళ్‌ అరసి తెలిపారు.


ఉచితం..పేదలకు సాంత్వనం

గజ్వేల్‌: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో గజ్వేల్‌లో దాదాపు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో 2019లో ఏర్పాటు చేసిన జిల్లా ఆస్పత్రిలో అన్ని సేవలతోపాటు ప్రత్యేకంగా ఆర్థోఫిట్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కళ్ల శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ప్రసూతి సేవలు గణనీయంగా అందుతున్నాయి. నెలకు సుమారు 400 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. కణితులు, అపెండిక్స్‌ ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో శస్త్రచిక్సితకు దాదాపు రూ.60 వేలకు ఖర్చు అవుతున్నాయి. ఇక్కడ ఉచిత సేవలతో పేదలు సాంత్వన పొందుతున్నారు. నవజాత శిశువులకు వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుబాటులోకి రావటంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు మెడ్చల్‌మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లా నుంచి రోగులు ఇక్కడ సేవలు పొందుతున్నారు.


వ్యయప్రయాసలకు దూరం


ఆధునిక పరికరంతో శస్త్రచికిత్స

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి.. 400 పడకల నుంచి 600 పడకలకు స్థాయికి పెరిగింది. నిత్యం ఇక్కడికి వేయికి పైగా రోగులు వస్తుంటారు. సుమారు 250 మంది ఇన్‌పేషెంట్లుగా సేవలు పొందుతుంటారు. ఇక్కడ ఇది వరకు చిన్న పాటి ప్రమాదం జరిగినా.. అత్యవసరంలో గాంధీ, నిలోఫర్‌, నిమ్స్‌ , ఉస్మానియాతోపాటు ప్రైవేట్‌కు రోగులు తరలి వెళ్లేవారు. మార్గ మాధ్యలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత ఇక్కడ డయాలసిస్‌ సేవలకు శ్రీకారం చుట్టారు. గత మూడు మాసాల్లో ఇక్కడ 500 మంది సేవలు పొందారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అదనంగా 600 పడకలకు ప్రత్యేకంగా మెడికల్‌ కళాశాలను ప్రభుత్వం  మంజూరు చేస్తూ అనుమతులు ఇచ్చింది. భవన నిర్మాణాల పనులు  వేగంగా సాగుతున్నాయి. ప్రిన్సిపల్‌తోపాటు 65 మంది వైద్యనిపుణులను భర్తీ చేసింది. గుండె నొప్పి వచ్చిన వారికి వెంటనే ఆరోగ్య పరీక్షల్లో కీలకమైందినది ఈసీజీ. పరీక్ష చేయగానే వెంటనే వైద్య నిపుణుడి చరవాణికి సమాచారం చేరేలా శ్రీకారం చుట్టారు. సంబంధిత రోగికి అనుమానం లేకుండా చేసేందుకు ఈ సేవలు అమలు చేస్తున్నామని గుండె జబ్బు నిపుణుడు అనిల్‌ వివరించారు. ఊపిరితిత్తులు, ఎముకలు, హెర్నియా, కడుపులో గడ్డలు, కిడ్నీ, చెవి, ముక్కు, గొంతు చికిత్సలు అందుతున్నాయి. వెంటిలేటర్‌, సౌకర్యం, గ్యాస్ట్రో, పక్షపాతం, పురుగు మందు తాగి పరిస్థితి విషమించిన వారిని బతికించేలా చర్యలు తీసుకుంటున్నారు. సీటీ స్కానర్‌తో వెంటనే ఫలితాలు ఇవ్వడంతో వైద్య సేవలు అమలవుతున్నాయి. ఇక్కడికి ఉమ్మడి మెదక్‌ జిల్లా వాసులతోపాటు సమీపంలోని వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లా వాసులు సద్వినియోగం చేసుకుంటున్నారు. గత అక్టోబర్‌ నుంచి జనవరి 25 వరకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో జనరల్‌ సర్జరీలు 112, ఆర్థోపెడిక్‌ చికిత్సలు 39, ఈఎన్‌టీ సేవలు 02 చేసినట్లుగా జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు కె.సంగారెడ్డి తెలిపారు.


నవజాత శిశువుకు వెచ్చదనం

మెదక్‌: జిల్లా కేంద్రం మెదక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ పడకలు, డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయగా, ఇటీవల నవజాత శిశు కేంద్రం అందుబాటులోకి వచ్చింది. అప్పుడే జన్మించిన శిశువులను వాతావరణం తట్టుకునేలా వెచ్చదనాన్ని ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఇంక్యూబేటర్‌లో ఉంచి ఎప్పటికప్పుడు శిశువు గుండె చప్పుడు తెలుసుకునేలా పరికరం అందుబాటులో ఉంచారు. ఫొటోథెరపీ ద్వారా పసిరికలు, శ్వాస ఇబ్బంది ఉన్న చిన్నారులకు ఆక్సిజన్‌ అందిస్తున్నారు. గర్భస్త శిశువు ఎదుగుదల, గుండె పనితీరు, శ్వాసతీరు, ఎన్నినెలల వయస్సు వంటివి స్కానింగ్‌ చేసే సదుపాయం కల్పించారు. గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ఇందులోనే చికిత్స పొందుతున్నారు. తద్వారా వారికి ఆర్థికభారం తప్పింది. రూ.54 లక్షలతో ఈ కేంద్రాన్ని ఇటీవల ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని