logo

చినుకులు కలవరపెడుతున్నాయ్‌!

అకాల వర్షాలు అన్నదాతలను భయపెడుతున్నాయి. వరి ధాన్యం పండించి కల్లాల్లో ఆరబెట్టిన వారికి కునుకు కరవవుతోంది. త్వరగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిచేయాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Published : 20 May 2022 01:15 IST

ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేసేలా దృష్టిసారిస్తే మేలు

ఈనాడు, సంగారెడ్డి

అకాల వర్షాలు అన్నదాతలను భయపెడుతున్నాయి. వరి ధాన్యం పండించి కల్లాల్లో ఆరబెట్టిన వారికి కునుకు కరవవుతోంది. త్వరగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిచేయాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ధాన్యం తడిస్తే.. తాము నష్టపోతామని, అన్ని విధాలుగా ఇబ్బందులు తప్పవని రైతులు ఆవేదనగా చెబుతున్నారు. జిల్లాలో ఈసారి 155 కేంద్రాలు తెరిచి వడ్లు కొంటున్నారు. 35వేల ఎకరాల్లో వరి సాగవగా... 75వేల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 24శాతమే కొన్నారు. మరో 76శాతం కొనాల్సి ఉంది. దీంతో చాలా మంది రైతులు తమ వంతు కోసం నిరీక్షిస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తమై కొనుగోళ్లు వేగిరం చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయినా ప్రక్రియ వడివడిగా సాగడం లేదు.

కొన్ని మండలాల్లోనే ఎక్కువ సాగు..: యాసంగిలో వరి సాగు వద్దని చెప్పడంతో చాలా మంది పంట వేయలేదు. వరి సాగుకు తాత్కాలికంగా విరామమిచ్చారు. కొందరు మాత్రం ఇతర పంటలు సాగుచేసే అవకాశం లేక చివరకు వరి సాగుకే మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో 35వేల ఎకరాలకే ఈ సాగు పరిమితమైంది. ప్రధానంగా పుల్కల్‌, అందోలు, హత్నూర, కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో ఎక్కువగా వరి సాగయింది. ఇక్కడ కొంత ప్రత్యేక శ్రద్ధ చూపి వేగంగా కొనుగోళ్లు చేస్తే ఆ మేరకు అన్నదాతలకు ఊరట లభిస్తుంది.

అకాల వర్షాలతో ఆవేదన

జిల్లాలో ఈనెల 1 నుంచి 18 వరకు పరిశీలిస్తే... సగటున మూడు రోజుల పాటు వానలు పడ్డాయి. రాత్రుళ్లూ గాలి దుమారంతో వర్షాలు పడుతుండటంతో చాలా మంది రైతులు కేంద్రాల వద్దే నిద్రిస్తున్నారు. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షాల వల్ల నోటికాడి కూడు నీళ్లపాలవుతుందేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని వేగంగా కొనుగోళ్లు జరిగేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలి.

ఇరవై రోజులైనా కొనలేదు

- పల్లె శివరాజ్‌, గోవిందరాజుపల్లి (హత్నూర)

సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి 20 రోజుల కిందట ధాన్యం తీసుకొచ్ఛా ముందు తీసుకొచ్చిన రైతులందరికీ టోకెన్లు ఇచ్చారు. మా వడ్లు ఇంత వరకు కొనలేదు. మాకంటే వెనక వచ్చినవాళ్లు విక్రయించి వెళ్లిపోయారు. ఇదేంటని అడిగితే... అందరివీ కొంటామని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ధాన్యం తేమశాతం 10లోపే ఉంది. కొద్ది రోజులుగా నిత్యం వర్షాలు కురుస్తున్నాయి. రాత్రివేళల్లో కొనుగోలు కేంద్రం వద్దే కాపలాగా పడుకోవాల్సి వస్తోంది. కొనుగోళ్లను వేగంగా, పారదర్శకంగా చేపట్టకపోతే... మేం నిండా మునిగిపోతాం. ముందు వడ్లను తీసుకొచ్చిన రైతులకు ప్రాధాన్యమిచ్చి కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరుతున్నాం. రోజులు గడుస్తున్న కొద్దీ టార్పాలిన్ల అద్దె భారంగా మారుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలి.

గణాంకాలిలా...

* ధాన్యం సేకరణ లక్ష్యం (మెట్రిక్‌ టన్నులు):75,000

* ఇప్పటి వరకు కొన్నది (మె.ట.): 17,566

* మిల్లులకు చేరవేసింది (మె.ట.): 16,937

* రైతుల సంఖ్య: 4,028

* కొనుగోలు చేసిన ధాన్యం విలువ: రూ.34.43కోట్లు

* రైతులకు చెల్లింపులు: రూ.13.60కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని