logo

రోగులెక్కువ.. వైద్యులు తక్కువ

డివిజన్‌ కేంద్రమైన నర్సాపూర్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండగా వైద్యులు తగ్గుతుండటంతో ఇబ్బందికరంగా మారుతోంది.

Updated : 01 Jun 2023 04:34 IST

నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: డివిజన్‌ కేంద్రమైన నర్సాపూర్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండగా వైద్యులు తగ్గుతుండటంతో ఇబ్బందికరంగా మారుతోంది. అత్యంత ప్రధానమైన విభాగాలకు చెందిన వైద్యులను ఇతర ఆసుపత్రులకు డిప్యుటేషన్‌పై పంపడంతో సరైన వైద్యసేవలందడం లేదు. ప్రస్తుతం వివిధ రుగ్మతలతో వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రి గడప తొక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులను వేరే చోటికి పంపడంతో రోగులకు సరైన సేవలు అందకుండా పోతున్నాయి. ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.

ఓపీ కోసం బారులుతీరి..

16 మంది..

ఆసుపత్రిలో మొత్తం 16 మంది వైద్యులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ముగ్గురు గైనిక్‌, ఒకరు దంత వైద్యం అందిస్తున్నారు. ఇద్దరు మత్తు వైద్యులు కాగా, రాత్రిపూట ముగ్గురు, ఓపీలో ముగ్గురు సేవలందిస్తున్నారు. మరో నలుగురిని ఆయా ఆసుపత్రులకు డిప్యుటేషన్‌పై పంపడంతో రోగులకు సేవలు నామమాత్రమే అయ్యాయి. ఎముకల వైద్యం కోసం 8 మండలాల నుంచి రోగులు వచ్చి వెళుతున్నారు. ప్రస్తుతం ఉన్న 12 మందిలో నిత్యం ఒకరు ఇద్దరు సెలవుపై వెళుతుండగా రోగులకు సరైన సేవలందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాయాలతో వచ్చిన వారిని గాంధీ, ఉస్మానియా, సంగారెడ్డి జిల్లా ఆసుపత్రులకు పంపిస్తున్నారు.

ఎక్స్‌రే టెక్నీషియన్‌ సైతం..

ఆసుపత్రిలోని ఎక్స్‌రే విభాగంలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న గాలప్పను సైతం మెదక్‌ ఆసుపత్రికి డిప్యుటేషన్‌పై పంపారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే మరో టెక్నీషియన్‌కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో విధుల నుంచి తప్పుకున్నారు. ఇద్దరూ లేకపోవడంతో ఎక్స్‌రే సేవలు నిలిచిపోయాయి. అత్యవసర సమయాల్లో ప్రైవేటుకు వెళుతున్నారు. రేడియాలజిస్టు పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఓప్రైవేటు ఆసుపత్రి శిక్షణార్థులతో నెట్టుకువస్తున్నారు.


ఉన్నతాధికారులకు నివేదించాం:

ఆసుపత్రిలో ఖాళీలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నాం. అందుబాటులో ఉన్న వైద్యులతో మెరుగైన సేవలందించడానికి కృషి చేస్తున్నాం. ఎక్స్‌రే యంత్రం వినియోగానికి టెక్నీషియన్‌గా అనుభవం ఉన్న మరొకరితో నెట్టుకు వస్తున్నాం.

డాక్టర్‌ మిర్జానయీంబేగ్‌, ఆసుపత్రి పర్యవేక్షకులు


నిత్యం వచ్చే రోగులు: 400-500 (సంతరోజు శుక్రవారం అదనంగా రాక)
రోజూ వస్తున్న ఇన్‌పేషెంట్లు: 70-80
పడకల సంఖ్య: 100 ప్రస్తుతం ఉన్న వైద్యులు: 12
డిప్యుటేషన్‌పై వెళ్లిన వారు: 4 (వైద్యులు) 1-ఎక్స్‌రే టెక్నీషియన్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని