logo

అమ్మా.. నేనే భారమవుతున్నానా!

ఏ తల్లయినా కన్నబిడ్డను ఇతరులకు అమ్ముకోవాలనుకోదు. పుట్టిన బిడ్డను పారేయాలనుకోదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణంగా అటువైపు అడుగులు వేయిస్తుండటం ఇబ్బందికరంగా మారుతోంది.

Updated : 15 Jun 2023 06:52 IST

ఆగని శిశు విక్రయాలు

నవజాత శిశువు

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: ఏ తల్లయినా కన్నబిడ్డను ఇతరులకు అమ్ముకోవాలనుకోదు. పుట్టిన బిడ్డను పారేయాలనుకోదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణంగా అటువైపు అడుగులు వేయిస్తుండటం ఇబ్బందికరంగా మారుతోంది. ఇటీవల సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం మోతె గ్రామానికి చెందిన మహిళకు ఆడబిడ్డ పుట్టిన రెండోరోజునే అమ్మేసింది. దీన్ని అధికారులు గమనించి నిలువరించారు. ఏదో ఒక ప్రాంతంలో శిశు విక్రయాల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పేదల పరిస్థితిని ఆసరా చేసుకొని కొందరు దళారులు డబ్బు ఆశ చూపి మానవీయతకు భంగం కలిగించే శిశు విక్రయానికి తెరలేపుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో 2018లో విక్రయించగా తెలుసుకున్న జిల్లా బాలల పరిరక్షణ అధికారులు శిశువును స్వాధీనం చేసుకొని బాలల సదనానికి తరలించారు. ఈ నెల 13న అక్బర్‌పేట-భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామానికి మహిళకు వారం క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికి ఉండటానికి ఇల్లు లేదు. ఆమె గత సోమవారం ప్రసవించింది. నలుగురు సంతానాన్ని పోషించలేక దళారుల సాయంతో గజ్వేల్‌ పట్టణానికి చెందిన దంపతులకు శిశువును అమ్మేయగా అధికారులు అడ్డుకున్నారు. జిల్లాలో 25 మంది సంతానం లేని దంపతులు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి దత్తత తీసుకున్నారు. పెంచి పోషిస్తున్నారు. గజ్వేల్‌, పొన్నాల, కేసీఆర్‌ నగర్‌, బెజ్జంకి ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బిడ్డలను చెత్త కుప్పల్లో, ముళ్ల పొదల్లో పడేసిన ఘటనలున్నాయి. విక్రయాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది.


చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
డాక్టర్‌ రాము, డీసీపీవో, సిద్దిపేట

శిశువుల క్రయవిక్రయాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పెంచి పోషించే స్థోమత లేకపోతే బాలల సదనంలో చేర్పించాలి. సంతానం లేని వారికి నిబంధనల మేరకు దత్తత ఇస్తాం. స్వాధీనం చేసుకున్న బిడ్డల సంక్షేమానికి పాటుపడతాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు