logo

జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం

జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్‌లో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శంకర్‌ తెలిపిన ప్రకారం..

Published : 29 Mar 2024 02:53 IST

ఇరుక్కుపోయిన వెంకటప్ప

యాలాల, న్యూస్‌టుడే: జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్‌లో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శంకర్‌ తెలిపిన ప్రకారం.. యాలాల మండల పరిధిలోని అగ్గనూర్‌ గ్రామ శివారులో తాండూరు నుంచి బషీరాబాద్‌ వైపు 15 మంది ప్రయాణికులతో ఓ జీపు వస్తోంది. అదే సమయంలో బషీరాబాద్‌ మండలం దామర్‌చేడ్‌ గ్రామంలో పెళ్లి కార్యక్రమం ముగించుకున్న 8 మంది ఓ ఆటోలో తాండూరుకు బయలుదేరారు. రెండూ గ్రామ సమీపంలోని కట్టెల మిషన్‌ ముందు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో జీపులోని వారికి ఏమీ కాలేదు. వారు వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయారు. ఆటోలో కూర్చున్న తాండూరుకు చెందిన కుర్వ మల్లప్ప(45) అక్కడికక్కడే చనిపోగా, చంద్రకళ, వెంకటప్పలకు తీవ్ర గాయాలు, జుంటిపల్లికి చెందిన బొడ్డు శివకుమార్‌, భార్య విమల, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో ముందు కూర్చున్న వెంకటప్ప, చంద్రకళ అందులోనే ఇరుక్కుపోయారు. స్థానికులు వారిని బయటికి తీసి యాలాల ఎస్‌ఐ శంకర్‌, 108 వాహనానికి ఫోన్‌ చేశారు. వారు వచ్చి బాధితులను తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన చంద్రకళ, వెంకటప్పను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో యువకుడు..

లక్ష్మణ్‌

సదాశివపేట: మండల పరిధిలోని జాతీయ రహదారిపై నిజాంపూర్‌ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని వెల్టూరుకు చెందిన కె.లక్ష్మణ్‌(20), రాములు సోదరులు. వీరిద్దరు ద్విచక్ర వాహనంపై సదాశివపేటకు వెళ్తుండగా.. జహీరాబాద్‌ వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. లక్ష్మణ్‌ అక్కడికక్కడే మరణించగా.. రాములు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సంగారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్‌ తెలిపారు.


విద్యుదాఘాతంతో రైతు మృతి

మల్లారెడ్డి

కంది: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన కంది మండలం ఇంద్రకరణ్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపిన వివరాలు.. కంది మండలం కలివేములకు చెందిన చెల్మేటి మల్లారెడ్డి(48) వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. గురువారం పొలం వద్ద విద్యుత్తు నియంత్రికకు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతమై అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


వరకట్నం వేధిపుల కేసులో ఏడేళ్ల జైలు

ములుగు: అదనపు కట్నానికి భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చిందని ములుగు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ గురువారం తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరుకు చెందిన చింతల మల్లేశ్‌కు రాయపోల్‌ మండలం ఎల్కంటికి చెందిన రజితతో మూడేళ్ల కిందట వివాహమైంది. వరకట్నం కింద రెండెకరాలతో పాటు కట్న కానుకలు ఇచ్చి వివాహం చేశారు. కొద్దిరోజుల తర్వాత అదనపు కట్నం తేవాలని వేధించగా ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో రూ.2 లక్షలు ఇచ్చారు. ఆర్నెల్ల తర్వాత తనకు ద్విచక్ర వాహనం కావాలని మల్లేశ్‌ వేధించాడు. అతడి బాధలు భరించలేక రజిత  ఆత్మహత్య చేసుకుంది. తండ్రి శంకరయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. గజ్వేల్‌ ఏసీబీ పురుషోత్తంరెడ్డి, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వెంకటలింగం వాదనలు వినిపించారు. మల్లేశానికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సిద్దిపేట జిల్లా న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి రఘురాం తీర్పునిచ్చారు.


దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారి అరెస్ట్‌  

నిందితుడిని చూపిస్తున్న పోలీసులు

తాండూరు టౌన్‌: ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పట్టణ సీఐ సంతోష్‌ కుమార్‌ తెలిపిన వివరాలు.. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వడ్డీ వ్యాపారి మ్యాతరి రవి.. రాజీవ్‌ కాలనీకి చెందిన ఆటో డ్రైవరు బాలయ్యకు రూ.5వేలు అప్పు ఇచ్చాడు. రెండు నెలలు కొంత మొత్తం చెల్లించాడు. ఒక నెల వడ్డీ ఇవ్వలేకపోయాడు. దీంతో బాలయ్యను ఇంటికి పిలిచి గేటు వేసి రవి దాడిచేశాడు. తన కుమారుడితో వీడియో తీయించి రవి సామాజిక మాధ్యమంలో ప్రచారం చేశాడని బాధితుడి ఫిర్యాదుతో వ్యాపారిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని