logo

జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం

జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ...

Published : 29 Mar 2024 03:08 IST

వివిధ అంశాలపై పరిశోధక విద్యార్థుల ఆసక్తికర విశ్లేషణ

న్యూస్‌టుడే, సిద్దిపేట: జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు సాగిన సదస్సు ప్రస్ఫుటం చేసింది. వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో పూర్తిస్థాయిలో 15 పరిశోధనా పత్రాలు అందాయి. శాస్త్రవేత్తలు, సీనియర్‌ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పరిశోధక, యూజీ, పీజీ విద్యార్థులు తమ ఆవిష్కరణలతో ఆలోచింపజేశారు. ప్రాథమిక స్థాయిలో 115 పరిశోధన వ్యాసాలు సావనీర్‌గా వెలువరించారు. ఈ సందర్భంగా పరిశోధక యువ విద్యార్థులను ‘న్యూస్‌టుడే’ పలకరించగా తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.


ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా..: దేవానంద, కేరళ

త్రివేండ్రంలో డిజిటల్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పర్యావరణ శాస్త్రం ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. దేశంలో 80 చిత్తడి, తడి నేలలు ఉన్నాయి. వీటిలో పదింటిని ఎంపిక చేసుకొని ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా పరిశోధించా. సరస్సులు, నదీ ప్రాంతాలు ఇందులో భాగమే. కొల్లేరు సరస్సు, ఒడిశాలోని చిలుక సరస్సు తదితర వాటి పరిస్థితిని విశ్లేషించా. 1990 తరువాత రాజస్థాన్‌లో సాల్ట్‌పాండ్స్‌ విస్తీర్ణం పెరిగింది. ఇది ప్రకృతిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చిత్తడి నేలల్లో మత్స్య సంపద పెంపకం కారణంగా జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది.


సమతుల్యతకు దోహదం: అఫ్రోజ్‌, ఎమ్మెస్సీ, సిద్దిపేట

వృక్ష రాజ్యంలో మొట్టమొదటి జీవి శైవలం (నీటిపాచి). చెరువుల్లో వీటిని గుర్తించడంపై పరిశోధిస్తున్నాం. సిద్దిపేటలోని ఎర్ర, కోమటిచెరువు, కప్పలకుంట సహా నర్సాపూర్‌, రంగధాంపల్లిలోని చెరువు, కుంటలను ఎంచుకున్నాం. రెండు నెలల కిందట షురూ చేశాం. సావనీర్‌లో నేను రాసిన అంశం ప్రచురితమవడం ఆనందంగా ఉంది. ఆకుపచ్చ, నీలి ఆకుపచ్చ, ముదురు గోధుమ రంగు శైవలాలు గుర్తించాం. కిరణజన్యసంయోగ క్రియతో ఆహారం ఉత్పత్తి చేసుకుంటూనే నీటిలో సమతుల్యతకు దోహదం చేస్తాయి.


మైక్రోస్కోప్‌ ఆధారంగా..: కావ్యశ్రీ, ఎమ్మెస్సీ, జీడీసీ-సిద్దిపేట

ముగ్గురం కలిసి ఆసక్తిగా పరిశోధన చేశాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటిలో పెరిగే కొన్ని శైవలాల జాతులను గుర్తించాం. ఎక్కువగా మన ప్రాంతంలో ఆకుపచ్చ శైవలాలు కనిపించాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి సంఖ్యాబలం పెరుగుతుంది. అధ్యాపకులు డా.ఎం.శ్రీనివాస్‌ మార్గదర్శకత్వంలో ముందుకు సాగాం. ఆయా నమూనాలు సేకరించి ప్రయోగశాలలో 4 శాతం ఫార్మాలైన్‌ కెమికల్‌ను జత చేసి నిల్వ చేశాం. మైక్రోస్కోప్‌ ద్వారా ఫలితాలు కనిపించాయి.


జలవనరుల నాణ్యత: సంధ్యారాణి, ఎమ్మెస్సీ, సిద్దిపేట

మా స్వస్థలం మెదక్‌. సిద్దిపేటలో ఉంటూ చదువుకుంటున్నా. వివిధ రకాల కాలుష్యాల కారణంగా జల వనరుల నాణ్యత దెబ్బతింటుంది. సంబంధిత సూచనలను శైవలాల ద్వారా తెలుసుకోవచ్చు. జిల్లాలోని నీటి వనరుల్లో శైవలాల జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించాం. వాటిని డిజిటల్‌ ఫొటోలుగా తీసి భద్రపర్చాం. నీలి ఆకుపచ్చ శైవలం కారణంగా కొన్ని సందర్భాల్లో నీటి కలుషితం ఎక్కువగా అవుతుంది. దీంతో అందులో జీవించే జలచరాలకు నష్టం చేకూరుతుంది.


అటవీ విస్తీర్ణంపై..: జ్యోతికుమారి, ఝార్ఖండ్‌

ములుగు అటవీ కళాశాల, పరిశోధనా కేంద్రంలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. 1972-2023 కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ విస్తీర్ణం, మార్పులు-చేర్పులు అంశాలపై గతేడాది డిసెంబరు నుంచి పరిశోధన చేశా. రాష్ట్రంలో అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం కలిగి ఉండటంతో ఆ జిల్లాను ఎంచుకున్నా. 2015 నుంచి సంరక్షణ చర్యలతో అడవులకు మేలు చేకూరుతోందని గుర్తించా. ఆసక్తిగా పరిశోధన సాగుతోంది.


సత్ఫలితాలు సాధ్యమే: డా. కె.రాణి, వృక్షశాస్త్ర విభాగాధిపతి, సదస్సు కన్వీనర్‌

సదస్సు ద్వారా తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమల వంటి కొన్ని సున్నిత ప్రాంతాల్లో పెరిగే అరుదైన మొక్కలను గుర్తించి మనుగడలోకి తేవాలంటూ వక్తలు తమదైన శైలిలో విశ్లేషించారు. స్థానికంగా పెరిగే ఔషధ మొక్కలను గుర్తించి వినియోగంలోకి తేవడం ద్వారా సత్ఫలితాలు సాధ్యం. ఇందుకు లోతైన పరిశోధనలు తప్పనిసరి. అరుదుగా పెరిగే మొక్కలను సంరక్షించాలి. ప్రాథమిక అంశాలను రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో పరిశోధన పుస్తకంగా వెలువరిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని