logo

వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు.

Published : 24 Apr 2024 02:54 IST

 ప్రభుత్వ ఉపాధ్యాయుడి కేసు గుట్టును ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ వెంకటేశ్‌

చేగుంట, న్యూస్‌టుడే: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. రామాయంపేట సీఐ వెంకటేశ్‌, చేగుంట ఎస్సై బాలరాజు తెలిపిన ప్రకారం.. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌కు చెందిన మోతుకూరి నాగరాజు (53) మాసాయిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటోంది. చేగుంట రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఓ ఇంట్లో నాగరాజు అద్దెకు ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఆ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న వంగ స్వాతి, అలియాస్‌ మాధవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె భర్త సత్యనారాయణ, అలియాస్‌ సతీష్‌ అనుమానించాడు. ఎలాగైనా నాగరాజును అంతమొందించాలని నిర్ణయించాడు. ఇందుకోసం హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ ఎల్లమ్మబండకు చెందిన తన బావమరిది వర్కాల మల్లేశ్‌, అతని స్నేహితుడైన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన సునీల్‌గౌడ్‌ సహకారం కోరాడు. పథకం ప్రకారం ముగ్గురూ కలిసి గత నెల 28 రాత్రి నాగరాజును అద్దె ఇంట్లోనే కొట్టి హత్య చేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు మల్లేష్‌, సునీల్‌గౌడ్‌ ఆ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని కారులో తరలించి కేపీహెచ్‌బీ ప్రగతినగర్‌ చెరువులో పడేశారు. తన తండ్రి కనిపించడంలేదని నాగరాజు కుమారుడు చేగుంట ఠాణాలో ఈ నెల 1న ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టారు. సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా, తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడితో పాటు మల్లేశ్‌, సునీల్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సత్యనారాయణ భార్య స్వాతి ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని