logo

ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం

పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్‌ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు

Updated : 25 Apr 2024 06:32 IST

గజ్వేల్‌, పటాన్‌చెరుపై దృష్టి

 న్యూస్‌టుడే, గజ్వేల్‌, మెదక్‌, పటాన్‌చెరు: పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్‌ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల వారీగా బలాబలాలపై అంచనా వేస్తూ ప్రచారానికి పథక రచన చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కంటే పార్టీకి బలం లేని చోట ఎక్కువగా శ్రమ పడాలని బూతు స్థాయిలో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఇప్పటికే సెగ్మెంట్ల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన భారాస, భాజపా, కాంగ్రెస్‌ ప్రస్తుతం రోడ్‌షోలు, సెగ్మెంట్లలో స్థానిక నేతల ద్వారా ప్రచారం  హోరెత్తించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మెదక్‌ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 18,19,397 మంది ఓటర్లున్నారు. ఇందులో అత్యధికంగా పటాన్‌చెరులో 4,10,609 మంది ఓటర్లుండగా తరువాత గజ్వేల్‌లో  2,79,868 మంది ఓటర్లున్నారు. పార్టీల చూపు ఎక్కువగా ఈ రెండు నియోజకవర్గాలపైన నేతలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2009తోపాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మెదక్‌ స్థానం భారాస ఖాతాలోనే ఉంది. ఇప్పుడు మరోమారు గెలిచితీరాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్‌, భాజపా నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

గత ఎన్నికల్లో..: 2014 ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ అసెంబ్లీ స్థానంతోపాటు మెదక్‌ పార్లమెంటుకు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ 6,57,429 ఓట్లు (55.20శాతం) సాధించి 3,97,029 ఓట్ల ఆదిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డికి 21.87 శాతం, భాజపా అభ్యర్థి నరేంద్రనాథ్‌కు 15.25 శాతం ఓట్లు వచ్చాయి. కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టి మెదక్‌ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,61,277 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2019 ఎన్నికల్లో భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి 5,96,048 ఓట్లు (51.82 శాతం) వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన గాలి అనిల్‌కుమార్‌కు 2,79621 ఓట్లు (24.31 శాతం) వచ్చాయి. భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన (ప్రస్తుత భాజపా అభ్యర్థి) రఘునందన్‌రావుకు 2,01,567 ఓట్లు (17.52 శాతం) వచ్చాయి.

పరపతితో ముందుకు..: ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో గెలవాలని పట్టుదలతో ఉంది. ప్రచారశైలిని మార్చుకుంటూ మూడు పార్టీల నేతలు ముందుకు దూసుకెళ్తున్నారు. గజ్వేల్‌ స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పార్టీ బాధ్యతల్లో ఉండటంతో గజ్వేల్‌లో ఓట్లు ఎక్కువగా వస్తాయని నేతలు ధీమాతో ఉన్నారు. భారాస నేత ప్రతాప్‌రెడ్డి తన పరపతితో ఓట్ల శాతం పెంచడానికి కృషి చేస్తున్నారు. గజ్వేల్‌ పట్టణానికి చెందిన వంటేరు యాదవరెడ్డి భారాస ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గజ్వేల్‌లో అధిక శాతం ఓట్లు సాధిస్తే కేసీఆర్‌ దృష్టిలో పడి పేరు పొందొచ్చని ఆయన వ్యూహరచనలో ఉన్నారు. పటాన్‌చెరులో స్థానిక భారాస ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నియోజకవర్గం పటాన్‌చెరు కావటంతో ఆయన ప్రత్యేక దృష్టిసారించి ప్రచారం కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని