logo

ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత

ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం కోనాయిపల్లిలో జరిగింది.

Published : 26 Apr 2024 01:25 IST

నితిన్‌

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం కోనాయిపల్లిలో జరిగింది. ఎస్సై ప్రేమ్‌దీప్‌ తెలిపిన ప్రకారం మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పాలట గ్రామానికి చెందిన భిక్షపతి, కవిత దంపతుల కుమారుడు నితిన్‌ (10) నాలుగో తరగతి చదువుతున్నాడు. బడికి సెలవులు ఇవ్వడంతో తన అమ్మమ్మ గ్రామం కోనాయిపల్లికి వచ్చాడు. అమ్మమ్మ లక్ష్మి, తాతయ్య శంబయ్యలతో కలిసి బుధవారం దౌల్తాబాద్‌లో పెళ్లికి వెళ్లాడు. అనంతరం తాను ఇంటికి వెళ్తున్నానని వారికి చెప్పి వచ్చాడు. వారు ఇంటికి వచ్చి చూస్తే మనవడు కనిపించలేదు. దీంతో బంధువుల ఇళ్ల వద్ద, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం శంబయ్య గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లగా, నితిన్‌ మృతదేహం పైకి తేలి కనిపించింది. అమ్మమ్మ లక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


చెరువులో పడి మత్స్యకారుడు..

నర్సింలు 

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట గ్రామీణ మండలం చింతమడకలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఎస్‌ఐ అపూర్వరెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మోతుకు నర్సింలు (38) వ్యవసాయంతో పాటు చేపల వేట సాగిస్తుంటాడు. గురువారం ఉదయం తోటివారితో కలిసి గ్రామంలోని చెరువుకు వెళ్లాడు. వలలు వేసి లోపలికి ఈదుకుంటూ వెళ్లారు. లోతు ప్రదేశంలో ఊపిరాడక పోవడంతో మునిగి మృతి చెందాడు. అతడికి భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరి దుర్మరణం

కౌడిపల్లి, న్యూస్‌టుడే: ఎదురెదురుగా రెండు స్కూటీలు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం కూకుట్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. కూకుట్లపల్లికి చెందిన మంగలి రమేశ్‌(30) ద్విచక్ర వాహనంపై కౌడిపల్లికి వస్తున్నాడు. అదే సమయంలో మరో వ్యక్తి స్కూటీపై టీవీ పెట్టుకొని దుంపలకుంట వైపునకు వెళ్తున్నాడు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేశ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వివరించారు. మృతుడు అశోక్‌కు భార్య శ్రీనిధ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


పెట్రోల్‌కు రోడ్డు దాటుతుండగా..

గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద రాజీవ్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. గజ్వేల్‌ సీఐ సైదా వివరాల ప్రకారం.. దాతర్‌పల్లికి చెందిన కంటే బాలయ్య(55), లక్ష్మి దంపతులు గురువారం ద్విచక్ర వాహనంపై ప్రజ్ఞాపూర్‌కు బయలుదేరారు. రిమ్మనగూడ దాటాక పెట్రోల్‌ కోసం రోడ్డు దాటుతుండగా సిద్దిపేట వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందాడు. లక్ష్మి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.


విద్యుదాఘాతంతో రైతు మృతి

సదాశివపేట, న్యూస్‌టుడే: విద్యుత్తు నియంత్రిక వద్ద మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన మండలంలోని నాగుపల్లిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ మహేశ్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. నాగుపల్లికి చెందిన గొల్ల అశోక్‌(42) తన పొలంలో చెరకు, జొన్న సాగు చేస్తున్నాడు. చేనుకు నీరు పెట్టేందుకు బోరు మోటారు ఆన్‌ చేయగా పనిచేయలేదు. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో నియంత్రిక వద్దకు వెళ్లి పరిశీలించాడు. జంపర్‌ తీగ తెగిపోయి ఉంది. మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించాడని తెలిపారు. మృతుడి భార్య రాణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


హత్యకేసులో 12 మందికి రిమాండ్‌

కల్హేర్‌: సిర్గాపూర్‌ గ్రామ శివారులోని సింగార్‌బొగుడతండాకు చెందిన శీనునాయక్‌ హత్యకేసులో 12 మంది నిందితులకు గురువారం న్యాయమూర్తి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు కంగ్టి సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, సిర్గాపూర్‌ ఎస్సై మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. హత్యకేసుతో సంబంధమున్న జాదవ్‌రాజుతో సహా 11 మంది నిందితులను గురువారం నారాయణఖేడ్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జి అనూష వారికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించినట్లు ఎస్సై వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు