logo

కమలదళం.. గెలుపు వ్యూహం

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు భాజపా ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది.

Published : 30 Apr 2024 06:40 IST

నేడు అందోలు నియోజకవర్గంలో ప్రధాని మోదీ సభ 

సభా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంపీ బీబీ పాటిల్‌

ఈనాడు, కామారెడ్డి: జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు భాజపా ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది. జాతీయ నాయకులను ఆహ్వానించి నియోజకవర్గం పరిధిలో భారీ బహిరంగసభలు నిర్వహించడంతో పాటు ఇంటింటి ప్రచారానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే నేడు(మంగళవారం) అందోలు నియోజకవర్గంలోని అల్లాదుర్గం శివారులో నిర్వహించే భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ప్రచార గడువు ముగిసేలోపు మరో నాలుగు చోట్ల భారీ బహిరంగసభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.

నాలుగు నుంచి పది గ్రామాలకో క్లస్టర్‌

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇంటింటి ప్రచారం చేపట్టేందుకు భాజపా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. మండలంలోని నాలుగు నుంచి పది గ్రామాలను ఓ క్లస్టర్‌గా ఏర్పాటు చేసి క్రియాశీల కార్యకర్తలకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. వీరు తమకు నిర్దేశించిన గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహిస్తూ భాజపాకు ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తున్నారు. క్లస్టర్‌తో ప్రచార కార్యాలయాన్ని తెరిచి ఉదయం, సాయంత్రం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మంతనాలు.. అంతర్గత ఒప్పందాలు

సామాజికవర్గాల వారీగా సమ్మేళనాలు నిర్వహిస్తూ భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రత్యర్థి పార్టీలోని ముఖ్యనేతలతో భాజపాకు చెందిన సీనియర్‌ నేతలు మంతనాలు సాగిస్తు పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. పార్టీలో చేరేందుకు ముందుకు రాకపోతే అంతర్గతంగా సహకరించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అందోలు, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌లతో పాటు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గంపై భాజపా ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేపడుతోంది. ఈ నియోజకవర్గాల్లోనే ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్యకార్యకర్తలు, పెద్దనేతలతో అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపడుతూ దేశరాజకీయాల్లో ప్రధాని మోదీ ప్రభావాన్ని చాటిచెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ప్రజల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు

వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు

అల్లాదుర్గం, జోగిపేట: బహిరంగ సభకు హాజరయ్యే వారికోసం నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి- మెదక్‌ నుంచి వచ్చే వారి కోసం చిల్వర శివారులో, జహీరాబాద్‌ నుంచి వచ్చేవారికి శ్రీవాణి పాఠశాల, ఎల్లారెడ్డి, జుక్కల్‌, కామారెడ్డి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు సభా ప్రాంగణం ముందు భాగంలో పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.

ప్రధాని రాకకు ఎదురు చూస్తున్నారు: బీబీపాటిల్‌

ప్రధాని పాల్గొనే సభను విజయవంతం చేయాలని జహీరాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి ఎంపీ బీబీ పాటిల్‌ పిలుపునిచ్చారు. సోమవారం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ధర్మం, దేశం కోసం కృషి చేసే మహనీయుడు మోదీ అని కొనియాడారు. అల్లాదుర్గం ప్రజలు ప్రధానిరాకకు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.  ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్‌ రమేష్‌, ఎస్‌పీజీ అధికారులు, మాజీ ఎమ్మెల్యే అరుణతార, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, ఆలే భాస్కర్‌, అల్లాదుర్గం యాదగిరి, రాములు,  కోనం విఠల్‌, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని