logo

మహిళా సంఘాలకు సీఎస్‌సీ కేంద్రాలు

పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు.

Published : 02 May 2024 06:15 IST

సంగారెడ్డి, జహీరాబాద్‌లో ఏర్పాటుకు సన్నాహాలు

సంగారెడ్డిలో పొదుపు సంఘాల సభ్యులకు శిక్షణ

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జోగిపేట: పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు పట్ణణ వినియోగదారుల సేవా కేంద్రాల(సీఎస్‌సీ) ఏర్పాటుకు మెప్మా రాష్ట్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా ఈ ఆదేశాలిచ్చినప్పటికీ.. అమలు కాలేదు. ఈసారి సీఎస్‌సీ కేంద్రాల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లక్ష జనాభా దాటిన పురపాలికల్లో మొదట అమలు చేయనున్నారు. ఎస్‌బీఐ, స్త్రీ నిధి విభాగాల మార్గదర్శకంలో పట్టణ వినియోగదారుల కేంద్రాలు నిర్వహించనున్నారు. తొలుత జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, మరో పట్టణం జహీరాబాద్‌లో నిర్వహించి.. అక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా ఇతర పురపాలికల్లో అమలు చేయనున్నారు.

ఎంపిక విధానమిది..: సంగారెడ్డి, జహీరాబాద్‌లో సీఎస్‌సీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అత్యధిక జనాభా ఈ పట్టణంలోనే ఉండటంతో ఎంపిక చేశారు. పట్టణ వినియోగదారుల సేవా కేంద్రాన్ని స్లమ్‌ స్థాయి సమాఖ్య(టీఎల్‌ఎఫ్‌)కు అప్పగిస్తారు. పట్టణంలో ‘ఎ’, ‘బి’ గ్రేడ్‌ స్థాయిలో ఉన్న ఎస్‌ఎఫ్‌ఎల్‌లకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో విద్యావంతులైన ఓ మహిళను ఎంపిక చేసి కేంద్రం నిర్వహణ బాధ్యతను అప్పగిస్తారు. ఆమెకు ధృవపత్రం జారీ చేస్తారు. ఈ కేంద్రాన్ని ఏదైనా బ్యాంకు సమీపంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మెప్మా పీడీ, పురపాలక కమిషనర్‌ పరిశీలించి నిర్ణయిస్తారు. సీఎస్‌సీ కేంద్రం ఏర్పాటయితే మహిళా సంఘాల సభ్యులకు ఆదాయమూ సమకూరనుంది.

నిర్వహణ ఇలా..: పట్టణ వినియోగదారుల కేంద్రాల్లో మహిళా సంఘాలకు సంబంధించిన పొదుపు ఖాతాలతో ఇతరులు కూడా ఖాతాలు ప్రారంభించవచ్చు. ఖాతాదారులకు ఏటీఎం కార్డులు సైతం జారీ చేస్తారు. మహిళా సంఘాల పొదుపు, రుణాలు, వృద్దుల ఆసరా పింఛన్లు.. ఇలా ప్రతి ఆర్థిక లావాదేవీలు ఈ కేంద్రాల ద్వారా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం సంగారెడ్డి తొలుత ఏర్పాటు చేసి.. ఆ తర్వాత జహీరాబాద్‌లో ప్రక్రియ చేపడతారు. సీఎస్‌సీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉందని డీఎంసీ మల్లీశ్వరి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని