logo

జొన్న రైతులకు బకాయిల బెంగ

అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

Published : 02 May 2024 06:18 IST

1673 మంది ఎదురుచూపులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

ఝరాసంఘం మండలం కక్కర్‌వాడలో గోదాం వద్ద జొన్నల లోడుతో లారీలు

న్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గోదాంకు తరలించిన తర్వాత ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం వల్ల జొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో జొన్న విక్రయాలు చేపట్టిన 48 గంటల్లో కర్షకుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క రైతుకైనా చెల్లించలేదు.

ఏప్రిల్‌ 16 నుంచి కొనుగోళ్లు

ఈ ఏడాది యాసంగిలో జిల్లాలో అత్యధిక మంది రైతులు జొన్న పంట వైపు ఆసక్తి చూపారు. దీంతో వ్యవసాయ శాఖ అంచనాలకు మించి సాగయింది. ఇందుకు అనుగుణంగా మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర చెల్లిస్తామని ప్రకటించారు. ఏప్రిల్‌ 16 నుంచి ఝరాసంగం, ఏడాకులపల్లి, ఖాదీరాబాద్‌, కొండాపూర్‌, సదాశివపేట, బొక్కాస్‌గావ్‌, మనూరు, నిజాంపేట, రాయికోడ్‌, కంగ్టి, కల్హేర్‌, బాచేపల్లి, బీబీపేట, మునిపల్లి మండలం పెద్ద చెల్మడ, సంజీవరావుపేట, నాగల్‌గిద్ద కేంద్రాల్లో జొన్నల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

హమాలీల కొరత: జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేసిన జొన్నలను సదాశివపేట, ఝరాసంఘం మండలం కక్కరవాడలోని గోదాంలలో నిల్వ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఆ రెండు చోట్లకు కొనుగోలు కేంద్రాల నుంచి లారీల్లో తరలించిన జొన్నలను దగుమతి చేసేందుకు సరిపడా హమాలీలు లేరు. 50 మంది అవసరం కాగా 10 మందే వస్తుండటంతో ప్రక్రియ జాప్యమవుతోంది. జొన్నలను గోదాంలో దిగుమతి చేసిన తర్వాత ట్రక్కు షీటు ఇచ్చినట్లుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తేనే రైతులకు బిల్లులు మంజూరవుతాయి. హమాలీల సమస్య వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.


వెంటనే జమ చేసేలా చర్యలు
శ్రీదేవి, మార్క్‌ఫెడ్‌ డీఎం

కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన జొన్నలను గోదాంలకు తరలిస్తుంటారు. గోదాంల నిర్వాహకులు ట్రక్కు షీట్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. ఆయా పత్రాలను ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌లో పంపిస్తాం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. హమాలీల సంఖ్య పెంచి గోదాంల వద్ద జాప్యం కాకుండా చూస్తాం. జొన్నలు విక్రయించిన తర్వాత 48 గంటల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు