logo

అప్రమత్తతోనే ప్రశాంతం

ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్‌సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు.

Published : 02 May 2024 06:24 IST

122 కేంద్రాల్లో కేంద్ర బలగాలతో పటిష్ఠ నిఘా

న్యూస్‌టుడే, సిద్దిపేట: ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్‌సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు. పోలింగ్‌ రోజున కొందరు గొడవలు సృష్టించే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేకంగా నిఘా సారించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామనే భరోసా కల్పిస్తూ స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి. పోలీసు కమిషనర్‌ డా. బి.అనూరాధ నేతృత్వంలో ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

మరో ఐదు కంపెనీలు

సమస్యాత్మ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్‌ రోజున వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది. లొకేషన్‌ వద్ద ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, నలుగురు కానిస్టేబుళ్లు, కేంద్ర సాయుధ బలగాల సిబ్బందితో బందోబస్తు చేపట్టనున్నారు. 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే అక్కడికి త్వరగా చేరుకునేందుకు ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉంటాయి. వివిధ స్థాయిల్లో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. ఇప్పటికే జిల్లాకు సీఐఎస్‌ఎఫ్‌ కంపెనీ నుంచి 80 మంది సిబ్బంది చేరుకున్నారు. రానున్న రోజుల్లో మరో ఐదు కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు రానున్నాయి.


131 కేసుల్లో 136 మంది బైండోవరు

మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1010 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో సాధారణ పోలింగ్‌ కేంద్రాలు 888 ఉండగా.. సమస్యాత్మకమైనవి 122గా తేల్చారు. లొకేషన్లపరంగా చూస్తే మొత్తం 626 ఉండగా.. అందులో సాధారణమైనవి 575, సమస్యాత్మకమైనవి 51 ఉన్నాయి. మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 131 కేసుల్లో 136 మందిని బైండోవరు చేశారు. వారి కదలికలపై దృష్టి సారించారు. దాదాపుగా 26 పోలీసు ఠాణాల పరిధిలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.


ఫిర్యాదులను టోల్‌ఫ్రీ 1950 నంబరుకు చేయొచ్చు
బి.అనూరాధ, పోలీసు కమిషనర్‌

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. పోలింగ్‌ రోజున నిర్దేశిత కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో గస్తీ నిర్వహిస్తాం. ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చెక్‌పోస్టుల వద్ద రూ.1.28 కోట్ల నగదు, 388 గ్రాముల బంగారు ఆభరణాలు, 2,049 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఎన్నికల ఫిర్యాదులను టోల్‌ ఫ్రీ నం. 1950 లేదా సీ-విజిల్‌్ యాప్‌ ద్వారా చేయొచ్చు. డయల్‌-100 లేదా పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నం. 87126 67100 సంప్రదించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని