logo

ఎండ పెరిగి.. మీటర్లు తిరిగి

ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు.

Published : 02 May 2024 06:31 IST

పెరుగుతున్న విద్యుత్తు వినియోగం

మెదక్‌లో నిర్మానుష్యంగా ప్రధాన రహదారి

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. ఎండల కారణంగా ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లతో పాటు విద్యుత్తు పరికరాల వాడకం పెరిగిపోవడంతో చాలామంది పరిమిత యూనిట్లు దాటిపోయి, రాయితీని పొందలేకపోతున్నారు. గత నెలతో పోలిస్తే గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య తగ్గినా.. రాయితీ డబ్బు పెరగడం విశేషం. గతంలో 100 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించుకున్న లబ్ధిదారులు సైతం ఎక్కువ విద్యుత్తును వాడుతున్నారు. కానీ వినియోగం 200 యూనిట్లలోపు ఉండడంతో వారికి ఇచ్చే రాయితీ సొమ్ము పెరిగింది. అధికారుల లెక్కల మేరకు లబ్ధిదారుల సంఖ్య తగ్గినా... వినియోగం పెరగడంతో ప్రభుత్వానికి రాయితీ భారం పెరుగుతోంది.

తగ్గిన సర్వీసులు: జిల్లా వ్యాప్తంగా 2,04,945 విద్యుత్తు కనెక్షన్లు ఉండగా, తెల్లరేషన్‌ కార్డు ఉండి గృహజ్యోతి పథకం కింద లబ్ధిపొందే వారు 1,14,027 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మార్చి నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించుకున్న 1,11,258 సర్వీసులకు జీరో బిల్లులు ఇచ్చారు. తాజాగా ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగింది. గత నెలలో జీరో బిల్లులు పొందిన వారిలో కొంతమంది 200 యూనిట్లు దాటడంతో ఈ నెలలో బిల్లును చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలలో 1,09,649 సర్వీసులకు మాత్రమే జీరో బిల్లు వచ్చాయి. ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తును ఎక్కువగా వాడటంతో 1601 మంది అర్హతను కోల్పోయారు. మార్చి నెలలో రూ.2.66 కోట్లు రాయితీ ఇవ్వగా, ఈ నెలలో రూ.3.26 కోట్లుగా ఉంది. ఒక నెలలోనే రాయితీ సొమ్ము రూ.60 లక్షలకు పెరిగింది.

కోడ్‌ ముగిశాకే సవరణ: ఎన్నికల కోడ్‌ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. ప్రజాపాలనలో దరఖాస్తులు తప్పుగా ఇవ్వడంతో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్లు చేసిన తప్పిదాల వల్ల చాలా మంది జీరో బిల్లులను పొందలేక పోయారు. తర్వాత మార్చుకునేందుకు అవకాశం ఇచ్చినా.. అది పూర్తికాకముందే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ కోసం జిల్లాలో ఇంకా చాలా మంది ఎదురుచూస్తున్నారు. కోడ్‌ ముగిసిన తర్వాత జూన్‌ నెల నుంచి మిగతా వారు జీరో బిల్లు పొందే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగిస్తున్న కొంతమందికి ఆహార భద్రత కార్డులు లేకపోవడంతో గృహజ్యోతి పథకం కింద లబ్ధిపొందలేక పోతున్నారు.


43.9 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

మెదక్‌, న్యూస్‌టుడే: భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. వడగాల్పులు వీయడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే ఎండ వేడి ప్రారంభమై సాయంత్రం ఏడుగంటల వరకు ఉంటోంది. బుధవారం రామాయంపేట మండల ప్రగతి ధర్మారంలో 43.9 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో జిల్లాలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. వడగాల్పుల కారణంగా మెదక్‌లో ప్రధాన రహదారులు బోసిపోయాయి.


పొదుపుగా వాడాలి
- రాంబాబు, డీటీఈ విద్యుత్తు ఎస్‌ఈ కార్యాలయం

గృహజ్యోతి పథకం కింద లబ్ధి పొందాలంటే.. జిల్లాలోని ప్రతి ఒక్కరూ విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి. 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించుకుంటేనే రాయితీ వర్తిస్తుంది. వేసవిలో విద్యుత్తు పరికరాల వినియోగం అధికమవడంతో 200 యూనిట్లలోపు విద్యుత్తును వాడుకునే వారు తగ్గినప్పటికీ వాడకం పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని