logo

ఓటింగ్‌ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి

ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో అవసరమైన బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు. 

Published : 02 May 2024 06:37 IST

‘న్యూస్‌టుడే’తో మెదక్‌ లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌రాజ్‌

న్యూస్‌టుడే-మెదక్‌: ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో అవసరమైన బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు.  వేసవి నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రంలో కనీస వసతుల కల్పనపై దృష్టి సారించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంపు కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు మెదక్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. ఆయన మాటల్లోనే...


కారణాలను క్రోడీకరించి

పోలింగ్‌ శాతం పెంచేందుకు స్వీప్‌ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నాం. ద్విచక్రవాహన ర్యాలీలతో పాటు హోర్డింగ్‌లను ఏర్పాటు చేశాం. కళాశాల, పాఠశాలలో క్యాంపస్‌ అంబాసిడర్లను నియమించి 18 ఏళ్లు నిండిన వారి ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ జిల్లాలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైన కేంద్రాలను 50 వరకు గుర్తించాం. కారణాలను క్రోడీకరించి, ఈసారి ఎన్నికల్లో వారు వినియోగించుకునేలా దృష్టి సారిస్తాం. 


కూలర్లు, షామియానాలు

భానుడి ఉగ్రరూపం దాలుస్తున్నందున పోలింగ్‌ రోజు కేంద్రాల వద్ద షామియానాలు, తాగునీటి వసతి, కుర్చీలు, విద్యుత్తు సౌకర్యం, ర్యాంపు, శౌచాలయాలు వంటి సౌకర్యాలు ఉంటాయి. సౌకర్యాల కల్పనకు పంచాయతీ కార్యదర్శులకు కొంత బడ్జెట్‌ కేటాయించనున్నాం. కేంద్రాలకు ఒక రోజు ముందు చేరుకునే సిబ్బందికి కూలర్‌ సౌకర్యం ఉంటుంది. దివ్యాంగులు ఓటు వేసేందుకు ర్యాంపులు, వీల్‌ఛైర్‌ను అందుబాటులో ఉంచుతాం. ఆశా కార్యకర్తలు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేస్తారు. వృద్ధులకు సహాయపడేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ వాలంటీర్లను నియమించనున్నాం. దివ్యాంగులకు రవాణా సౌకర్యం కల్పిస్తాం.


సరిపడా బ్యాలెట్‌ యూనిట్లు

ఒక బ్యాలెట్‌ యూనిట్‌లో 16 మంది అభ్యర్థుల పేరు, ఫొటో, పార్టీ గుర్తు ఉంటాయి. 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున, మూడు బ్యాలెట్‌ యూనిట్లు అవసరం. ఈ లెక్కన 2,124 పోలింగ్‌ కేంద్రాలకు(25 శాతం అదనంగా) సరిపడా యూనిట్లు ఆయా జిల్లాలకు చేరుకున్నాయి. గురువారం ర్యాండమైజేషన్‌ నిర్వహించాక, ఆయా సెగ్మెంట్లకు కేటాయించనున్నాం. ఈనెల 3 నుంచి ఆయా సెగ్మెంట్లలో కమిషనింగ్‌ చేపడుతారు. మూడు బ్యాలెట్‌ యూనిట్ల వినియోగంపై 3న పీఓ, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనున్నాం.


యాప్‌లపై విస్తృత ప్రచారం

అక్రమాలను అడ్డుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్‌, సువిధ వంటి ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదు రాగానే 100 నిమిషాల్లో పరిష్కరించి తిరిగి ఎన్నికల సంఘానికి నివేదిస్తాం. సి-విజిల్‌ యాప్‌పై విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన మూడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశాం.


రేపటి నుంచి హోం ఓటింగ్‌...

దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వారు ఇంటి వద్ద ఓటు వేసే హోం ఓటింగ్‌ కార్యక్రమాన్ని ఈనెల 3 నుంచి 5వరకు నిర్వహించనున్నాం. 85 ఏళ్ల పైబడిన వారు 744 మంది, 762 మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 61 రూట్లను ఏర్పాటు చేసి 63 టీంలను నియమించాం. ఈ ప్రక్రియంతా వీడియో చిత్రీకరణ చేయనున్నాం.


నర్సాపూర్‌లో ఓట్ల లెక్కింపు...

లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపును నర్సాపూర్‌లో చేపట్టనున్నాం. మెదక్‌, నర్సాపూర్‌, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు బీవీఆర్‌ఐటీ కళాశాలలో, సంగారెడ్డి, పటాన్‌చెరు సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపును గిరిజన బాలుర కళాశాలలో నిర్వహించనున్నాం. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌, ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నాం. మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వెలువడేలా చర్యలు తీసుకుంటాం.


పోలింగ్‌ కేంద్రాలపై నిఘా..

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా 50 శాతం కంటే ఎక్కువ పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను లోపల ఏర్పాటు చేయనున్నాం. సమస్యాత్మక కేంద్రాల్లో బయట కూడా ఏర్పాటు చేయడంతో పాటు సీఆర్‌పీఎఫ్‌, కేంద్ర పార మిలటరీ దళాలు బందోబస్తు చర్యలు చేపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని