logo

లక్ష్యం.. సాకారం చేసుకొని..

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు.

Updated : 03 May 2024 06:23 IST

సినిమా పోస్టర్‌

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం: సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. కానీ కొంతమందే ఈ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ కోవకే చెందిన ఓ యువకుడు సినీ డైరెక్టర్‌ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకున్నా కష్టపడి ఆ స్థాయికి ఎదగడం విశేషం. అతడే అక్కన్నపేట మండలం అంతకపేటకు చెందిన రామంచ రాజశేఖర్‌రెడ్డి. అతడు దర్శకత్వం వహించిన సినిమా ‘ది ఇండియన్‌ స్టోరీ’ శుక్రవారం విడుదల కానుంది.

అక్కన్నపేట మండలం అంతకపేటకు చెందిన రామంచ ఆదిరెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు రాజశేఖర్‌రెడ్డి. చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టం. అందులోనూ డైరెక్టర్‌ కావాలనేది ఆయన కల. పదో తరగతి హుస్నాబాద్‌లో, ఇంటర్‌ కరీంనగర్‌లో, బీఎస్సీ బయోటెక్నాలజీ వరంగల్‌లో పూర్తి చేశారు. డిగ్రీ పూర్తవగానే ఉద్యోగ ప్రయత్నం చేయకుండా డైరెక్టర్‌ కావాలనే తన కల నెరవేర్చుకునేందుకు హైదరాబాద్‌కు పయనమయ్యాడు. సినీ పరిశ్రమలో తెలిసిన వారెవరూ లేకున్నా తన పని తీరు, నైపుణ్యంతో పలువురు దర్శకుల వద్ద సుమారు పదేళ్లు పని చేశారు. దర్శకుడు సురేంద్రరెడ్డి వద్ద కొన్నాళ్లు చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన రేసుగుర్రం, కిక్‌ సినిమాలకు అసెస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. నాలుగేళ్ల క్రితం దర్శకుడిగా తన ప్రయాణాన్ని ఆరంభించారు. ‘ది ఇండియన్‌ స్టోరీ’ పేరిట సినిమాను షురూ చేశారు. కొన్ని కారణాలతో ఈ సినిమా చిత్రీకరణ రెండేళ్లు నిలిచిపోయింది. అడ్డంకులను అధిగమించి ఫూటింగ్‌ పూర్తి చేశారు.

సినిమా చిత్రీకరణలో దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి

హీరో కోహెడ మండల వాసి

ఈ సినిమాలో హీరోగా రాజ్‌భీంరెడ్డి, హీరోయిన్‌గా జారాఖాన్‌ నటించారు. రాజ్‌భీంరెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచల్‌చెర్వుపల్లి. హీరోయిన్‌ ముంబాయికి చెందిన వారు. నిర్మాత కూడా రాజ్‌భీంరెడ్డే. దేశంలో కులాలు, మతాల పేరిట జరుగుతున్న దాడులు, వీటితో రాజకీయం చేసే పార్టీలకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తీశారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అంతా రాజశేఖర్‌రెడ్డి వహించారు. శుక్రవారం ఒకేసారి 100 థియేటర్లలో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని