logo

కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి

విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు.

Published : 03 May 2024 01:31 IST

ఏళ్లుగా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు డిమాండ్‌
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, సిద్దిపేట, నర్సాపూర్‌, జహీరాబాద్‌ అర్బన్‌

విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఏళ్లుగా అలాగే ఉండిపోవడం గమనార్హం. ఈ సారైనా ఎన్నికయ్యే నాయకుడు ఈ దిశగా అడుగేసి పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఊతమివ్వాలని కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, నర్సాపూర్‌, జహీరాబాద్‌ ప్రాంతాల్లో పీజీ కళాశాలలు కొనసాగుతున్నాయి. సిద్దిపేటలో స్వయం ప్రతిపత్తి గల డిగ్రీ, పీజీ కాలేజీ ఉంది. ఇక్కడ ఎంతో మంది నాయకులు చదవడం గమనార్హం. ఇక సిద్దిపేట ఐదు జిల్లాలకు అనుంబంధంగా ఉంది. పొరుగున ఉన్న రాజన్న సిరిసిల్ల, జనగాం, మెదక్‌, కరీంనగర్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడికొచ్చి చదువుకుంటున్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఇతర ప్రైవేటు కళాశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యాభ్యాసం చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జహీరాబాద్‌ విద్యాక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. సంగారెడ్డికి నారాయణఖేడ్‌, అందోల్‌, జిన్నారం తదితర ప్రాంతా నుంచి విద్యార్థులు వచ్చి వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. శిక్షణ కేంద్రాలు సైతం పదుల సంఖ్యలో కొనసాగుతున్నాయి. సుమారు 20 వేల మందికి పైగా పలు కోర్సులు చదువుతున్నారు. మెదక్‌ జిల్లాలో గతంలో ఉన్న పీజీ కళాశాలను రద్దు చేశారు. ఇక్కడ నర్సాపూర్‌లో మాత్రమే ఈ కళాశాల ఉంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండటంతో వందలాది మంది అక్కడికి వెళ్లి కోర్సులు అభ్యసిస్తున్నారు.

ఐడీ కళాశాలగా..

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఘన చరిత్ర ఉంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఐడీ కళాశాలగా కొనసాగింది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన తర్వాత సంగారెడ్డి జిల్లా ఐడీ కళాశాలగా ఉంది. ఏకైక స్వయం ప్రతిపత్తి కళాశాల కూడా ఇదే. 3,200 మంది చదువుతున్నారు. కళాశాలను యూనివర్సిటీగా మార్చాలన్న డిమాండ్‌ ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం అధ్యాపకుల కొరత, నిధులలేమితో పాట్లు తప్పడం లేదు. 10 పీజీ కోర్సులు ఉండగా 620 మంది చదువుతున్నారు.

మినీ వర్సిటీ తలపించేలా..

సిద్దిపేటలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మినీ వర్సిటీని తలపిస్తుంది. ఇక్కడ 5 వేల మంది వరకు చదువుకుంటున్నారు. దీన్ని విశ్వవిద్యాలయంగా మార్చాలన్న డిమాండ్‌ రెండు దశాబ్దాలుగా ఉంది. ఇక్కడ డిజిటల్‌ లైబ్రరీని సైతం ఏర్పాటుచేశారు. మరెక్కడా లేనివిధంగా మత్స్య శాస్త్రానికి సంబంధించి ప్రత్యేక కోర్సు సైతం అమలవుతోంది. పూర్వవిద్యార్థులు సైతం నడుంబిగించి కళాశాల అభివృద్ధికి ముందుకొచ్చారు. ప్రస్తుతం వివిధ స్థాయిల్లో రాణిస్తున్న రాజకీయ ప్రముఖులు.. ఇక్కడ పట్టా పొందిన వారే కావడం విశేషం

ప్రతిపాదనకే పరిమితం

నర్సాపూర్‌లోని ఓయూ పీజీ కళాశాల

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో మాత్రమే ఒక్క పీజీ కళాశాల కొనసాగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధి పీజీ కళాశాలకు 50 ఎకరాల భూమి కేటాయిస్తే విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తామని సంబంధిత అధికారులు హామీ సైతం ఇచ్చారు. ఇక్కడ సరైన స్థలం లభ్యం కాక అది ప్రతిపాదనకే పరిమితమైంది. ఇక్కడి పీజీ కళాశాల ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోంది. సరైన వసతులు లేక నానాపాట్లు పడుతున్నారు. రెండేళ్ల కిందట పదెకరాలు కేటాయించగా.. నిర్మాణ పనులు షురూ కాలేదు. మూడేళ్ల కిందట ఎమ్మెస్సీ (ఇనార్గనిక్‌ కెమిస్ట్రీ), ఎంసీజే కోర్సులను సైతం ఎత్తేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని