logo

సాంకేతికత వినియోగం పారదర్శకతకు దోహదం

ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఇవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలి.

Published : 05 May 2024 01:11 IST

క్షేత్ర స్థాయి బృందాల కదలికలను కలెక్టరేట్‌ నుంచి పరిశీలిస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఇవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలి. ఈ రెండు సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఎన్నికల క్రతువు సజావుగా నిర్వహించినపుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎన్నికల విధానంలో మార్పులు చేస్తూ వస్తోంది. నూతన సాంకేతికతను వినియోగించి ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్న వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది.

షెడ్యూలు విడుదలైనప్పటి నుంచి..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటి నుంచే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత నెల 9న షెడ్యూలు విడుదల కాగా అప్పటి నుంచే కోడ్‌ అమలులోకి వచ్చింది. ఈ నెల 13న పోలింగ్‌ జరగనుంది. గత నెల 29న అభ్యర్థుల తుది జాబితా కూడా విడుదలైంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. వీటిపై ఫిర్యాదులు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.

సందేహాల నివృత్తికి..: ఓటరు హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ-1950 ద్వారా 8 రకాల సేవల్ని అందిస్తున్నారు. పోలింగ్‌, ఎన్నికల క్రతువు సజావుగా నిర్వహించేందుకు ఫిర్యాదులు, అభిప్రాయాల స్వీకరణ, ఎన్నికల అధికారికి సంబంధించిన వివరాలు, లోక్‌ సభ నియోజకవర్గ సమాచారాన్ని ఓటర్లకు తెలియజేయడం, ఓటరు నమోదు, పోలింగ్‌ కేంద్రం చిరునామా, ఎన్నికల సమాచారం, 24 గంటలు ఓటర్లకు సహాయం అందించడం వంటి సేవలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది షిప్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. ఫోన్‌ చేసిన వారి వివరాల నమోదుకు ప్రత్యేకంగా రిజిస్టర్‌ను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సంబంధిత వెబ్‌సైట్‌లోనూ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 184 మంది సందేహాలు నివృత్తి చేసుకున్నారు.

ఉల్లంఘనుల ఆటకట్టించేందుకు..

ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించే వారిని నియంత్రించడంలో సీ-విజిల్‌ యాప్‌ కీలకంగా మారింది. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తిస్తే పౌరులు ఎవరైనా నేరుగా యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించిన ఫొటో, వీడియో అప్‌లోడ్‌ చేయాలి. దీని ఆధారంగా అధికారుల బృందాలు వెంటనే అక్కడికి చేరుకుంటాయి. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే పరిష్కరిస్తాయి. ఇప్పటి వరకు 41 ఫిర్యాదులు అందగా పరిశీలించి చర్యలు తీసుకున్నారు.

జాతీయ స్థాయిలో ఎన్‌జీఆర్‌ఎస్‌

జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వార కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను నేషనల్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సెల్‌ సిస్టం(ఎన్‌జీఆర్‌ఎస్‌) ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై ప్రజలకు అవగాహన అంతంతమాత్రమే. గత శాసన సభ ఎన్నికల్లో 205 ఫిర్యాదులే అందడం దీనినే సూచిస్తోంది. ఈ వెబ్‌సైట్‌కు అందిన ఫిర్యాదులను రిటర్నింగ్‌ అధికారులకు చేరవేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని