logo

గ్రామీణులపైనే ఆశలు

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. భారాస, కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మద్దతు కూడగట్టేందుకే ప్రాధాన్యమిస్తున్నారు.

Updated : 05 May 2024 06:36 IST

పట్టణ ప్రాంతాల్లో 60 శాతానికి మించని పోలింగ్‌

ఈనాడు, కామారెడ్డి, జహీరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. భారాస, కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మద్దతు కూడగట్టేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌శాతం తక్కువగా నమోదవుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో పట్టణప్రాంతాల్లో 60 శాతానికి మించి పోలింగ్‌ నమోదు కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 70 నుంచి 75 శాతం నమోదవుతోంది. దీంతో పార్టీలన్నీ పల్లె ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నాయి.

వలసలూ ఓ కారణం

జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలుండగా.. కామారెడ్డి, జహీరాబాద్‌లలో పట్టణ జనాభా అధికంగా ఉంది. 2019లో జరిగి సార్వత్రిక ఎన్నికల్లో కామారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్‌ నమోదైంది. కామారెడ్డి, జహీరాబాద్‌ పట్టణ ప్రాంతాల్లో 50 నుంచి 55 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ఇక వలసల కారణంగా నారాయణఖేడ్‌లో తక్కువ పోలింగ్‌ నమోదైనట్లు నిర్ధారణ జరిగింది. రవాణా వ్యయం, ఉపాధి సమస్య కారణంగా పలువురు వలస కూలీలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటువేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

హోరెత్తుతున్న ప్రచారం

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో పాగా వేసేందుకు భారాస, కాంగ్రెస్‌, భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రచార సరళిని గమనిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే మూడు పార్టీలు పల్లెల్లో ఇంటింటి ప్రచారం చేపడుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఓటర్లకు తమ పార్టీల విధానాలు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నాయి. కూలీలు ఉపాధి పనులకు వెళ్తుండడంతో రాజకీయపార్టీల నాయకులు అక్కడికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే పల్లెల్లో మొదటి విడత ప్రచారం పూర్తిచేసిన పార్టీలు రెండో విడత ప్రచారం చేపట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని