logo

నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్‌

ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు.

Updated : 18 May 2024 04:35 IST

డిగ్రీలో ప్రవేశాలకు పచ్చజెండా
కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, సిద్దిపేట, మెదక్‌ టౌన్, వికారాబాద్‌ టౌన్‌: ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనిద్వారా తమకు ఇష్టమైన కళాశాలల్లో చేరే అవకాశాన్ని కల్పించారు. ఈ విద్యాసంవత్సరానికి ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో తొలి దశ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.

సులభంగా దరఖాస్తు: నచ్చిన కళాశాల, ఇష్టమైన కోర్సు ఎంచుకునేందుకు వీలుగా దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా వీలు కల్పించారు. ఇటీవల ఇంటర్‌ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ద్వితీయ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారంతా డిగ్రీ ప్రవేశ దరఖాస్తుకు అర్హత కలిగి ఉంటారు. ఆధార్‌ అనుసంధానం చేసిన స్మార్ట్‌ఫోన్‌ ఉంటే దానితో నేరుగా దోస్త్‌ వెబ్‌సైట్‌లో సులభంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. లేదంటే తల్లిదండ్రుల ఫోన్లకు విద్యార్థి తన ఆధార్‌ను అనుసంధానించి ప్రక్రియను కొనసాగించవచ్చు. టీయాప్‌ ఫోలియా మొబైల్‌ యాప్‌ ద్వారా అవకాశం కల్పించడం గమనార్హం.

మీసేవలో దరఖాస్తు చేస్తూ..

ఐచ్ఛికాలకు ప్రాధాన్యం: ఉన్నత విద్యా శాఖ విద్యార్థికి ప్రాధాన్యం ఇస్తూ ఛాయిస్‌ బేసిడ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌)ను అనుసరించి విద్యార్థి కేంద్రంగా కోర్సులను ప్రతిపాదిస్తూ అమలు చేస్తుండటం విశేషం. మార్పులకు అనుగుణంగా డిమాండ్‌ ఉన్న కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన కోర్సుల్లో విద్యార్థికి పలు ఐచ్ఛికాలు (ఆప్షన్లు) ఉంచాయి. తద్వారా నచ్చిన కోర్సు నుంచి ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంది.

సందేహాల నివృత్తికి..: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి సందేహాల నివృత్తికి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాల్లో దోస్త్‌ సహాయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇవి ఉన్నాయి. విద్యార్థులు ప్రవేశాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వీలుంటుంది. సహాయ కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందిస్తారు.

రెండు నెలల్లో..: దోస్త్‌ ప్రవేశాల ప్రక్రియ రెండు నెలల్లో పూర్తవుతుంది. ఇప్పటికే మొదలైన ఈ ప్రక్రియ జూన్‌ మొత్తం కొనసాగుతుంది. జులై 1 నుంచి 6 వరకు కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.

దరఖాస్తుతో జతచేయాల్సినవి

  • పది, ఇంటర్‌ మార్కుల మెమో.
  • కుల, ఆదాయం, ఆధార్‌ కార్డు. 
  • ఇంటర్‌ వరకు బోనఫైడ్‌ ధ్రువపత్రాలు. 
  • రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు. 
  • ఆధార్‌ లింక్‌ ఉన్న చరవాణి నంబరు. 
  • ఎన్‌సీసీ, పీహెచ్‌ ధ్రువపత్రాలు.

ప్రత్యేకతలను వివరిస్తూ..

నాలుగు జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ రకాల కోర్సులు కొనసాగుతున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ (సైన్స్, లైఫ్‌సైన్సెస్‌), బీబీఏ, బీజడ్సీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈసారి ఆయా కళాశాలల అధ్యాపకులు ముందు నుంచే క్షేత్రస్థాయిలో ప్రచారం ఆరంభించారు. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రత్యేకతలను వివరిస్తున్నారు. అందుబాటులో ఉన్న వసతులు, బోధన తీరు, ఫలితాలు, ప్రయోజనాలు వల్లెవేస్తున్నారు. ప్రత్యేకంగా కరపత్రాలు రూపొందించి పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని సహాయ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను ఉచితంగా చేపడుతున్నారు. సందేహాల నివృత్తికి సమన్వయకర్తలను సైతం నియమించారు.

అవకాశాన్ని వినియోగించుకోవాలి:

నాణ్యమైన విద్యా బోధనతో పాటు భవిష్యత్తులో స్థిరపడేందుకు అవసరమైన అన్ని రకాల మెలకువలు కళాశాలలో నేర్పిస్తున్నాం. ప్రముఖ సంస్థలు జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. తెలుగు మాధ్యమం విద్యార్థులు సైతం వారికి నచ్చిన కోర్సులను ఎంచుకునే సదుపాయం ఉంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

డాక్టర్‌ హుస్సేన్, మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌


నాణ్యమైన విద్య: రత్నప్రసాద్, ఐడీ కళాశాల ప్రిన్సిపల్, సంగారెడ్డి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరితే విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దోస్త్‌ వెబ్‌సైట్‌లో ద్వారా ప్రవేశాలకు వివరాలు నమోదు చేయడంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలనే ఎంచుకోవాలి. ఇక్కడ ఒత్తిడి లేని విద్య ఉంటుంది. అనుభజ్ఞులైన అధ్యాపకులు బోధిస్తారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వంటివి కూడా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని