ఖండాంతరాలు దాటిన విజయం
కిలిమంజారో పర్వతంపై జాతీయ జెండాతో విజయలక్ష్మి
నిడమనూరు, న్యూస్టుడే: ఆమె ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. రోజూ పాఠశాలకు చదువు చెప్పడం, తిరిగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గడపడమే తన జీవితం అని అనుకోలేదు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందాలనుకుంది. చిన్నప్పుడు ఉర్సు ఉత్సవాల్లో నల్గొండలోని లతీఫ్సాహెబ్ గుట్టను ఆగకుండా ఎక్కినప్పుడే తన సామర్థ్యంపై నమ్మకం ఏర్పర్చుకుంది. ఏనాటికైనా ఎత్తైన పర్వతాలను అధిరోహించాలని లక్ష్యం నిర్ధారించకుని విజయం సాధించింది. ప్రస్తుతం 49 ఏళ్లున్నా.. వచ్చే ఏడాది మరో శిఖరాన్ని అధిరోహించడానికి అవకాశం కోసం చూస్తోంది నిడమనూరుకు చెందిన కర్ర విజయలక్ష్మి.
ఆసక్తితో అడుగులేసి..
నిడమనూరుకు చెందిన వెంకట్రెడ్డి భార్య విజయలక్ష్మి.. త్రిపురారం మండలం కంపసాగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. పెద్దవూర మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సతీష్ మూడుసార్లు పర్వతారోహణ చేశారని తెలుసుకుని ఆయనను కలిశారు. అతని ద్వారా పర్వతారోహణ చేయించే బూట్స్ అండ్ క్రాంపన్స్ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ ఇచ్చిన శిక్షణ ద్వారా నైపుణ్యం సాధించి గతేడాది సెప్టెంబర్ 27న రుథుగైరాను ఎక్కడం ప్రారంభించి ఆరు రోజుల్లో 589.6 మీటర్లు అధిరోహించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఆఫ్రికా ఖండంలోని టాంజానియా అనే దేశం చేరుకొని ఆరు గంటల పాటు దట్టమైన అడవిలో మిగితా ట్రెక్కీలతో కలిసి ప్రయాణించి ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరమైన కిలిమంజారోను చేరుకున్నారు. ఆరున్నర రోజుల పాటు 589.5 మీటర్లు నడిచి లక్ష్యాన్ని సాధించారు.
మరిన్ని పర్వతాల అధిరోహణే లక్ష్యం - విజయలక్ష్మి
పర్వతారోహణం అంటే చిన్న విషయమేమీ కాదు. భూమి నుంచి వేల మీటర్ల ఎత్తులో నిటారుగా ఉన్న కొండలను ఎలాంటి యంత్రాల సహాయం లేకుండా శారీరక బలంతోనే ఎక్కాల్సి ఉంటుంది. తాగే నీరు కూడా పది సెకన్లలో గడ్డకట్టేంతా చలి ఉంటుంది. ఎక్కేటప్పుడు ఏ మాత్రం అదుపుతప్పినా అంతే సంగతులు. ఈ విన్యాసాలు యాభై ఏళ్లు దగ్గరపడిన మహిళకు సాధ్యమా అని కుటుంబ సభ్యులు మొదట వారించినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. వారికి సర్దిచెప్పి తన లక్ష్యాలను చేరుకుంటున్నాను. వచ్చే ఏడాదిలో రష్యాలోని ఎల్బ్రూస్ పర్వతారోహణే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తే నాలాంటి చాలా మంది పర్వతారోహకులు వారి లక్ష్యాలను సాధించగలుగుతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.