logo
Published : 04/12/2021 04:19 IST

ధాన్యం డబ్బు చెల్లింపుల్లో జాప్యం

తూకం వేసి 20 రోజులైనా అందని డబ్బులు

జిల్లాలో చెల్లించాల్సింది రూ.119 కోట్లు

భువనగిరి, న్యూస్‌టుడే: జిల్లాలో రైతులకు డబ్బు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రభుత్వం ప్రకటించినా వివిధ కారణాలతో ఆచరణకు నోచుకోవడంలేదు. కాంటాలు పూర్తై వారాలు గడుస్తున్నా పైసలు వస్తలేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్ల నిబంధనలను ప్రభుత్వం మార్చడంతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. పీఏసీఎస్‌, ఐకేపీ సెంటర్ల ద్వారం ప్రభుత్వం కొనుగోళ్లు జరుపుతున్న విషయం విధితమే. జిల్లాలో ఇప్పటి వరకు 271 కేంద్రాలు తెరిచి 10,782 మంది రైతుల నుంచి 90,304 మెట్రిక్‌ టన్నుల (మె.ట) ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకోసం రైతులకు రూ.170.49 కోట్లు చెల్లించాల్సి ఉంది. 82,050 మె.టలో మిల్లులకు తరలించారు. 485 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. 26,012 మె.టలకు రూ.51.37 కోట్లు చెల్లించారు. 64,092 మె.టలకు గాను రూ.119.12 కోట్లు చెల్లించాల్సి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం మిల్లులకు తరలిస్తారు. వెంటనే ఐకేపీ, పీఏసీఎస్‌ నిర్వాహకులు వివరాలను ఓపీఎంఎస్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తదుపరి ధాన్యం తమకు ముట్టినట్లు సంబంధిత మిల్లర్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే పౌరసరఫరాల సంస్థ రైతుల ఖాతాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమచేస్తుంది. రైతుల ఆధార్‌కార్డు, చరవాణి నెంబర్లకు అనుసంధానం చేసుకొని ఉండాలి. అప్పుడే బ్యాంక్‌ వివరాలు కన్పిస్తాయి. చాలామంది రైతులు ఆధార్‌కార్డు, చరవాణి నెంబర్లకు అనుసంధానం చేసుకోకపోవడం, కొనుగోలు సంస్థలు ఓపీఎంఎస్‌లో వెనువెంటనే ఎంట్రీ చేయకపోవడం, మిల్లర్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంలో జాప్యంతో డబ్బుల చెల్లింపులోనూ ఆలస్యమవుతుంది. జిల్లా యంత్రాంగం ఓపీఎంఎస్‌ ఎంట్రీలపై దృష్టిపెట్టి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.


ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో

-గోపికృష్ణ, మేనేజర్‌, జిల్లా పౌరసరఫాల సంస్థ

రైతుల ఆధార్‌కార్డు, చరవాణి నెంబర్లు అనుసంధానం కాకపోవడంతోనే చెల్లింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఓపీఎంఎస్‌ ఎంట్రీలోనూ ఆలస్యం జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తైన వారికి వెంటనే చెల్లిస్తున్నాం. డబ్బుల కొరత లేదు. మరింత త్వరితగతిన డబ్బులు చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నాం.


ఇరవై రోజులు దాటినా నగదు జమకాలేదు

-కోరె అశోక్‌, ఆత్మకూరు(ఎం)

పండిన 52 క్వింటాళ్ల ధాన్యాన్ని మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లగా నవంబర్‌ 11న తూకం వేశారు. ఆధార్‌, బ్యాంకు వివరాలన్నీ సకాలంలో ఇచ్చాం. 23 రోజులైనా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఐకేపీ నిర్వాహలకు అడిగితే త్వరలో బ్యాంకులో జమ అవుతాయని సమాధానం ఇస్తున్నారు కానీ డబ్బులు రావడం లేదు. అధికారులు స్పందించి వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి.


పైసల ఊసే లేదు

-బొక్కా బాల్‌రెడ్డి, పోచంపల్లి మండలం గుర్రంగారివాడ

11 ఎకరాల్లో సాగు చేశాను. ధాన్యం తీసుకొచ్చి 60 రోజుల తర్వాత కాంటా చేశారు. సుమారు 1,146 బస్తాలు కాంటా వేసి 11 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పైసల ఊసే లేదు. గతంలో కోసి 20 రోజుల్లో డబ్బులు చేతికందేది. ఇప్పుడు 70 రోజులు అవుతున్నా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. కొనుగోలు ఆలస్యమైనా డబ్బులు వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలి.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని