logo

ఈ తప్పిదం ఎవరిది..

వ్యవసాయ భూముల్లో భాస్వరం నిల్వలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విపరీతంగా రసాయన ఎరువులు వాడకమే దీనికి కారణం. దీంతో భూమి అసలు రూపాన్ని కోల్పోయి చౌడుగా మారుతోంది. ఫలితంగా వేసిన పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎరువుల వినియోగం,

Published : 21 Jan 2022 02:35 IST
మిర్యాలగూడలోని భూసార పరీక్ష కేంద్రం

కోదాడ, న్యూస్‌టుడే: వ్యవసాయ భూముల్లో భాస్వరం నిల్వలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విపరీతంగా రసాయన ఎరువులు వాడకమే దీనికి కారణం. దీంతో భూమి అసలు రూపాన్ని కోల్పోయి చౌడుగా మారుతోంది. ఫలితంగా వేసిన పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎరువుల వినియోగం, పెట్టుబడి తగ్గాలన్నా, నాణ్యమైన దిగుబడి రావాలన్నా భూసార పరీక్షలు తప్పనిసరి. 2018లో ప్రభుత్వం మినీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 23లక్షల ఎకరాల్లో 10 లక్షలకు పైగా రైతులు వివిధ పంటలు పండిస్తున్నారు. మొత్తం 275 మినీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐదు వేల ఎకరాలకు ఏఈవోని నియమించి, ఒక క్లస్టరుగా విభజించి ఉమ్మడి జిల్లాలో 235 రైతు వేదికల్లో ఈ మినీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. రూ. లక్షలు వెచ్చించి పరీక్ష కిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సరైన సమయంలో ఈ కిట్లను వినియోగించకపోవడంతో ఆ రసాయనాలు కాలం చెల్లిపోయాయి. అన్ని రకాల భూ సార పరీక్షలు చేయడానికి సరిపడా రసాయనాలు లేవు. జిల్లా కేంద్రాల్లో మాత్రమే అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. 2018లో ప్రతి ఉమ్మడి జిల్లాకు మొబైల్‌ బస్సును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో సిబ్బంది రైతుల పొలాల దగ్గరికి వెళ్లి భూసార పరీక్ష చేయాలి. కానీ ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వం మొబైల్‌ బస్సును కేటాయించకపోవడంతో రైతులు నిరాశ చెందారు.

అవగాహన కార్యక్రమాలేవి...

భూసార పరీక్షలతో కలిగే లాభాలు వ్యవసాయ అధికారులు రైతులకు వివరించేందుకు కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మినీ కేంద్రాలకు రైతులు మట్టిని తీసుకెళ్తే భూసార పరీక్ష చేస్తున్నారు. కొన్ని చోట్ల రసాయనాలు లేకపోతే జిల్లా కేంద్రంలో ఉన్న పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతుల భూముల దగ్గరికి వెళ్లి భూసార పరీక్షలపైనా, రసాయనాల వాడకం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.

సూర్యాపేటలో మూతపడ్డ పరీక్ష కేంద్రం..

గతంలో సూర్యాపేట మార్కెట్‌లో ఉన్న జిల్లా భూసార పరీక్ష కేంద్రం మూతపడింది. భవనం శిథిలావస్థకు చేరడంతో మూలకు పడేశారు. ఉమ్మడి జిల్లాలో మిర్యాలగూడ, భువనగిరిలో మాత్రమే భూసార పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది నల్గొండ, యాదాద్రి భువనగిరి ఒక్కో జిల్లాలో 2,400 మంది రైతుల భూములను పరీక్షించారు. వారికి మాత్రమే భూసార పరీక్ష కార్డులు అందజేశారు. సూర్యాపేటలో కేంద్రం లేకపోవడంతో ఒక్క రైతుకు కూడా భూసార పరీక్ష చేయలేదు.


ప్రణాళికలు రూపొందిస్తాం

- రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి, సూర్యాపేట

రైతులు రసాయన ఎరువులు వాడకం ఎక్కువైంది. మినీ పరీక్ష కేంద్రాల్లో రసాయనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భూ సార పరీక్షలు చేసి కార్డులు అందజేస్తాం.


జిల్లాల వారీగా వివరాలు

 

జిల్లా క్లస్టర్లు రైతులు ఎకరాలు (లక్షల్లో)

నల్గొండ 140 5,93,275 12.5

సూర్యాపేట 82 2,70,530 6.91

యాదాద్రి 53 2,43,400 4.70


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని